ZIM vs BAN: పూర్వ వైభవం దిశగా అడుగులేస్తుందా..!

6 Aug, 2022 11:33 IST|Sakshi

క్రికెట్‌లో జింబాబ్వే జట్టు మళ్లీ పూర్వ వైభవం సాధించే పనిలో పడిందా?.. అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. తాము ఆడుతుంది బంగ్లాదేశ్‌ లాంటి జట్టుతో అయినప్పటికి.. జింబాబ్వేకు ఇది గొప్ప ఫీట్‌ అని చెప్పొచ్చు. ఎందుకంటే జింబాబ్వే పూర్తిస్థాయి ఆటతీరు కనబరిచి దాదాపు 10 ఏళ్లకు పైనే అవుతుంది. ఒకప్పుడు ఆండీ ఫ్లవర్‌, గ్రాంట్‌ ఫ్లవర్‌, తైబూ, మసకద్జా, హిత్‌ స్ట్రీక్‌, క్యాంప్‌బెల్‌ లాంటి ఆటగాళ్లతో జింబాబ్వే సంచలన విజయాలు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి.
-సాక్షి, వెబ్‌డెస్క్‌

కానీ క్రమక్రమంగా ఆటగాళ్లు రిటైర్‌ అవ్వడం.. ఆదాయం లేక ఉన్న క్రికెటర్లు వేరే దేశానికి వలస వెళ్లడం.. ఆర్థిక మాంద్యం కూడా జింబాబ్వేను బాగా దెబ్బతీసింది. ఒకానొక దశలో ఆటగాళ్లు సరైన షూస్‌ లేకుండానే మ్యాచ్‌లు ఆడడం వారి ధీనస్థితిని కళ్లకు కట్టింది. అలాంటి జింబాబ్వే ఇప్పుడు కాస్త కొత్తగా కనిపిస్తుంది. జట్టులో ఉన్న ఆటగాళ్లు సమన్వయంతో ఆడుతూ ముందుకు వెళ్తున్నారు.

ఇటీవలే టి20 ప్రపంచకప్‌ 2022కు క్వాలిఫై అయ్యామన్న జోష్‌ జింబాబ్వేకు బూస్టప్‌ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. జింబాబ్వే పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌కు షాక్‌లు మీద షాకులు ఇస్తూనే వస్తుంది. ఇప్పటికే సొంతగడ్డపై తొలి ద్వైపాక్షిక టి20 సిరీస్‌ నెగ్గిన ఆనందంలో ఉన్న జింబాబ్వే.. తాజాగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో మరోసారి సంచలనం చేసింది. 300 పరుగుల పైచిలుకు లక్ష్యాన్ని అవలీలగా చేధించి బంగ్లాదేశ్‌కు మరోసారి షాక్‌ ఇచ్చింది.

6 పరుగులకే రెండు వికెట్లు.. 62 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయిన జింబాబ్వేను ఇన్నోసెంట్‌ కాయా, సికందర్‌ రజాలు ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. కాయా 122 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 110 పరుగులు.. సికందర్‌ రజా 109 బంతుల్లో 135 నాటౌట్‌, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) విలువైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. జింబాబ్వే క్రికెట్‌ చరిత్రలో ఈ ఇద్దరి భాగస్వామ్యం మూడో అత్యుత్తమం కావడం విశేషం. ఇంతకముందు 2014లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హామిల్టన్‌ మజకద్జ, సికందర్‌ రజాలు 224 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. 

ఇక జింబాబ్వేకు ఇది మూడో అత్యుత్తమ చేజింగ్‌ కావడం విశేషం. 11 ఏళ్ల క్రితం బులవాయో వేదికగా కివీస్‌తో మ్యాచ్‌లో జింబాబ్వే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది.
2022లో జింబాబ్వేకు ఇది రెండో వన్డే విజయం. ఈ ఏడాది జనవరిలో పల్లెకెలే వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే లంకకు షాక్‌ ఇచ్చింది. 
బంగ్లాదేశ్‌పై ఒక వన్డేలో విజయం సాధించడానికి జింబాబ్వేకు 9 ఏళ్లు పట్టింది. ఆఖరిసారి  మే 2013లో బులవాయో వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే బంగ్లాపై విజయం అందుకుంది. ఈ 9 ఏళ్ల కాలంలో జింబాబ్వే బంగ్లాదేశ్‌ చేతిలో వరుసగా 19 వన్డేల్లో పరాజయం చవిచూసింది. 
అయితే జింబాబ్వే ఈ విజయాలు బంగ్లాదేశ్‌పై సాధించడం తీసిపారేయాల్సిన విషయం కాదు. ఎందుకంటే రోజురోజుకు జింబాబ్వే పటిష్టంగా తయారవుతోంది. పెద్ద జట్లను ఓడించలేకున్నా.. అఫ్గనిస్తాన్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌ లాంటి జట్లకు షాకివ్వడం ఖాయం.

చదవండి: IND vs WI: నాలుగో టి20.. రోహిత్‌ శర్మ ఆడడంపై కీలక అప్‌డేట్‌

మరిన్ని వార్తలు