టూర్‌ నుంచి లాల్‌చంద్‌ను తప్పించిన భారత్‌

21 Oct, 2020 10:49 IST|Sakshi

పాక్‌ పర్యటనకు లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ గైర్హాజరు

భారత ఎంబసీ సూచనతో వైదొలిగిన జింబాబ్వే కోచ్‌

కరాచీ: భారత్‌ మాజీ క్రికెటర్, జింబాబ్వే హెడ్‌ కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ పాకిస్తాన్‌ పర్యటనకు గైర్హాజరయ్యారు. హరారేలోని భారత రాయబార కార్యాలయం 58 ఏళ్ల రాజ్‌పుత్‌కు మినహాయింపు ఇవ్వాలని కోరడంతో జింబాబ్వే ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఆయన జింబాబ్వే జట్టుతో కలిసి పాక్‌ పర్యటనకు వెళ్లలేదు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్‌ బోర్డు ట్విట్టర్‌లో వెల్లడించింది. ‘లాల్‌చంద్‌కు హరారేలోని పాకిస్తాన్‌ రాయబార కార్యాలయం వీసా జారీ చేసింది. అయితే భారత్‌ ఆయన్ని టూర్‌ నుంచి తప్పించాలని కోరింది. దీంతో ఆయన జట్టుతో పాటు పాక్‌కు బయలుదేరలేదు’ అని జింబాబ్వే క్రికెట్‌ బోర్డు ట్వీట్‌ చేసింది.
(చదవండి: ‘పింక్‌’ టెస్టు ఎక్కడో క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ)

ఆయన గైర్హాజరీ నేపథ్యంలో బౌలింగ్‌ కోచ్‌ డగ్లస్‌ హోండోకు తాత్కాలికంగా హెడ్‌కోచ్‌ బాధ్యతలు అప్పగించింది. భారత్‌ తీరుపై పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. జట్టుతో పాటు ఆయనకు అసాధారణ భద్రత ఏర్పాట్లు చేశామని... వీసా జారీ చేశాక కూడా రాజ్‌పుత్‌ను నిలువరించడం అర్థం లేని చర్యని పీసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడేందుకు జింబాబ్వే జట్టు మంగళవారం పాక్‌ చేరుకుంది. ఈ జట్టు గతంలో 2015లో చివరిసారిగా పాక్‌ పర్యటనకు వెళ్లింది. తాజాగా క్వారంటైన్, కోవిడ్‌ టెస్టులు ముగిశాక రావల్పిండిలో ఈ నెల 30, నవంబర్‌ 1, 3 తేదీల్లో మూడు వన్డేలు అనంతరం లాహోర్‌లో 7, 8, 10 తేదీల్లో మూడు టి20లు ఆడుతుంది.  
 

>
మరిన్ని వార్తలు