జింబాబ్వేకు బీసీసీఐ ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’... మరో సిరీస్‌ వేటలో భారత్‌! కళ్లన్నీ వాళ్ల మీదే!

18 Aug, 2022 04:32 IST|Sakshi
సిరాజ్, రుతురాజ్, ఇషాన్‌ కిషన్, గిల్‌; ప్రాక్టీస్‌లో జింబాబ్వే ఆటగాళ్లు

నేడు జింబాబ్వేతో భారత్‌ తొలి వన్డే

రాహుల్‌ సారథ్యంలో బరిలోకి టీమిండియా

మధ్యాహ్నం గం. 12:45 నుంచి

సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం  

India Tour Of Zimbabwe- హరారే: ఈ మధ్య విదేశానికెళ్లిన చోటల్లా విభిన్న కెప్టెన్‌లతో బరిలోకి దిగుతున్న టీమిండియా ఫలితాల్లో మాత్రం నిలకడగా సిరీస్‌ విజయాలను సాధిస్తోంది. ఇప్పుడు కూడా మరో ప్రయత్నం మరో సారథితో చేస్తోంది. జింబాబ్వే పర్యటనలో కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని భారత్‌ నేడు తొలి వన్డే ఆడనుంది. ఈ పర్యటన జింబాబ్వేకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’.

కేవలం ఈ మూడు వన్డేల సిరీస్‌తో వచ్చే రాబడితోనే జింబాబ్వే బోర్డు సగం ఏడాదికి సరిపడా ఖర్చుల్ని వెళ్లదీసుకుంటుందంట! ఈ నేపథ్యంలో ఇక్కడ సిరీస్‌ ఆసక్తికరమనే కంటే కూడా... ఆతిథ్య బోర్డుకు ఆర్థిక పుష్టికరమని చెప్పాలి.

అందరి కళ్లు రాహుల్, చహర్‌లపైనే...
ఇక సిరీస్‌ విషయానికొస్తే జట్టు కంటే కూడా... కొత్త కెప్టెన్‌ రాహుల్‌కు అగ్ని పరీక్షలాంటిది. ఎందుకంటే టీమిండియా ఇటీవల ఏ దేశమేగినా... ఎందుకాలిడినా గెలుస్తూనే వస్తోంది. ఎటొచ్చి ‘స్పోర్ట్స్‌ హెర్నియా’ సర్జరీతో రెండు నెలలుగా ఆటకు దూరమైన రాహుల్‌ ఫిట్‌నెస్‌కే ఇది టెస్ట్‌!

ఇక్కడ ఈ టాపార్డర్‌ బ్యాటర్‌ త్రిపాత్రాభినయం చేయాల్సి వస్తుంది. 100 ఓవర్ల పాటు మైదానంలో ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాలి. సారథిగా జట్టును నడిపించాలి. టాపార్డర్‌లో బ్యాట్‌తో సత్తా చాటాలి. అలాగే మరో ఆటగాడు కూడా సవాలుకు సిద్ధమయ్యాడు.

గాయంతో ఫిబ్రవరి నుంచి అసలు మైదానంలోకే దిగని దీపక్‌ చహర్‌ సుమారు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌ల కోసం అతన్ని పరిశీలించాలంటే  అందుబాటులో ఉన్న ఈ కొద్ది మ్యాచ్‌ల్లోనే ఆల్‌రౌండర్‌గా నిరూపించుకోవాలి.

ధావన్, గిల్, సామ్సన్‌ అంతా ఫామ్‌లోనే ఉన్నారు. బౌలింగ్‌లోనూ సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, స్పిన్నర్లు అక్షర్‌ పటేల్, కుల్దీప్‌లతో భారత జట్టే బలంగా ఉంది. ప్రస్తుత భారత జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తన వన్డే కెరీర్‌ను... అక్షర్‌ పటేల్, సంజూ సామ్సన్‌ తమ టి20 కెరీర్‌ను జింబాబ్వేలోనే ప్రారంభించారు.

జోరు మీదుంది కానీ...
ఈ నెలలోనే తమ దేశానికి వచ్చిన బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన జింబాబ్వే జోరుమీదుంది కానీ... భారత్‌లాంటి అసాధారణ ప్రత్యర్థితో ఎలా ఆడుతుందనేదే అసక్తికరం. ఏ రకంగా చూసినా కూడా టీమిండియాకు దీటైన ప్రత్యర్థి కాదు. కానీ సొంతగడ్డపై ఉన్న అనుకూలతలతో, ఇటీవలి విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో గట్టి పోటీ ఇచ్చేందుకు జింబాబ్వే తహతహలాడుతోంది.

కెప్టెన్, వికెట్‌ కీపర్‌ రెగిస్‌ చకాబ్వా, సికందర్‌ రజా, ఇన్నోసెంట్‌ కయా చక్కని ఫామ్‌లో ఉన్నారు. అయితే బౌలింగ్‌ మాత్రం పేలవమనే చెప్పాలి. టీమిండియాలాంటి టాప్‌ ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే బౌలింగ్‌ విభాగం కూడా మెరగవ్వాలి.

చదవండి: Vinod Kambli: ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. చాలీచాలని జీతంతో బ్రతుకీడుస్తున్నా..!
WI VS NZ 1st ODI: రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్
IRE VS AFG 5th T20: ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్.. సిరీస్‌ కైవసం

మరిన్ని వార్తలు