ఎండా కాలం.. మండే కాలం.. అప్రమత్తత అవసరం

28 Apr, 2023 00:20 IST|Sakshi
ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్న అగ్నిమాపక సిబ్బంది (ఫైల్‌)

అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన

అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారుల సూచన

నెల్లూరు(క్రైమ్‌) : రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతిఒక్కరూ అగ్నిప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులు సూచిస్తున్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గడిచిన ఆరు రోజులుగా సిబ్బంది అపార్ట్‌మెంట్‌లు, కర్మాగారాలు, షాపింగ్‌మాల్స్‌, విద్యాసంస్థలు, హాస్పిటల్స్‌ తదితరాల్లో అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేశారు.

వంటగదిలో..

స్టౌవ్‌ను నేలమట్టానికి వీలైనంత ఎత్తులో ఉంచుకోవాలి. అగ్గిపెట్టెలు, కిరోసిన్‌, క్యాలెండర్లు, వస్త్రాలు తదితర మండే స్వభావం కలిగిన వాటిని స్టౌవ్‌కు దూరంగా ఉంచాలి. అలాగే వంట చేసే సమయంలో వదులుగా, వేలాడే వస్త్రాలు ధరించరాదు. అగ్గిపుల్ల లేదా లైటర్‌ను వెలిగించిన తర్వాత మాత్రమే గ్యాస్‌ బర్నల్‌ నాబ్‌ను తిప్పాలి. వంట పూర్తయ్యాక సిలిండర్‌ వాల్వ్‌ను బర్నల్‌ వాల్‌ను నిలిపివేయాలి.

గ్యాస్‌ లీకైతే..

● అనుకోని పరిస్థితుల్లో గ్యాస్‌ లీకయితే వెంటనే రెగ్యులేటర్‌లు ఆపివేయాలి. ఎలక్ట్రికల్‌ స్విచ్‌లను ఆన్‌, ఆఫ్‌ చేయొద్దు. దేవుని దీపాలు, అగర్‌బత్తీలు ఆర్పివేయాలి. గాలి, వెలుతురు కోసం అన్ని కిటికీలు, తలుపులను తెరవాలి.

● గ్యాస్‌లీక్‌ వల్ల అగ్నిప్రమాదం సంభవిస్తే అవకాశముంటే రెగ్యులేటర్‌ వాల్వ్‌ను ఆఫ్‌ చేయాలి. అవకాశం లేకపోతే తడిపిన గోతంపట్టను లేదా తడి బట్టను మండుతున్న సిలిండర్‌పై వేయాలి. మంట ఆరిన తరువాత సిలిండర్‌ను ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లాలి.

వాహన ప్రయాణంలో..

కారు లేదా ఇతర వాహనాల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో వాహనంపై అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పడే అవకాశం ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ట్యాంకును పూర్తిగా నింపడం ప్రమాదకరం. ఎండ వేడిమికి రోడ్డపై తారు వేడెక్కుతుంది. దీనికి మితిమీరిన వేగం తోడైతే టైర్లు పేలిపోవడం, వాహనం అదుపుతప్పడం వంటివి జరగొచ్చు. టైర్లలో గాలి ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం మంచిది.

గంటల తరబడి ప్రయాణించినప్పుడు ఇంజిన్‌ వేడెక్కడం, వాహనంలోని వైరింగ్‌ కాలిపోవడం వల్ల అకస్మాత్తుగా మంటలు వ్యాపిస్తాయి. సెల్ఫ్‌ స్టార్టర్‌, లైట్లు, టేప్‌ రికార్డులు ఇలా అవసరమైన వాటికి ఉన్న వైర్లు వేడి వల్ల షార్ట్‌సర్క్యూట్‌ అవుతాయి. బ్యాటరీ, ఫ్యూజ్‌, విద్యుత్‌ వైర్లు నాణ్యమైనవి వాడాలి. వాహనంలో వైరింగ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. మధ్యాహ్న సమయాల్లో వాహనానికి తగినంత విరామం ఇచ్చి ప్రయాణించడం ఉత్తమం.

విద్యాసంస్థలు, భవనాలు, హాస్పిటల్స్‌లో..

తాటాకులు, గడ్డితో చేసిన పైకప్పును వాడరాదు, ఆర్‌సీసీ స్లాబ్‌లను మాత్రమే పైకప్పుగా వాడాలి. భవనం నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలి. అత్యవసర మార్గాలకు, ఫైర్‌ డోర్‌లకు తాళాలు వేయకూడదు.

ఎగ్జిట్‌ సైన్‌బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి. నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ ప్రకారం అగ్నిమాపక పరికరాలు ఏర్పాటుచేసి అవి ఎల్లప్పుడు పనిచేసే విధంగా ఉంచుకోవాలి. సిబ్బంది అందరికి ఫైర్‌ ఎక్విప్‌మెంట్‌ వాడకంపై అవగాహన కలిగి ఉండాలి.

ఇతర జాగ్రత్తలు

గ్రామాల్లో వేసవి కాలంలో అప్రమత్తంగా ఉండాలి. గుడిసె, గుడిసెకు మధ్య కనీస దూరం ఉండాలి. బహిరంగ మంటలను అనుమతించరాదు. దీని వల్ల నిప్పురవ్వలు ఎగిరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విద్యుత్‌ తీగలకు దగ్గరల్లో గడ్డివాములు ఏర్పాటు చేయరాదు.

ఏదైనా గుడిసెకు నిప్పంటుకుంటే పక్కనే ఉన్న గుడిసెలు, పూరిళ్లు, గడ్డివాములను పూర్తిగా నీళ్లతో తడపాలి. పంటపొల్లాలో మార్పిడి అయిన తర్వాత ఎండుగడ్డిని, పొడి మొక్క జొన్నను, చొప్పదంటు తదితరాలను తగులబెట్టే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. గడ్డివాములను చిన్న, చిన్నవిగా ఏర్పాటు చేసుకోవాలి.

అత్యవసర వేళల్లో సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు

కేంద్రం కార్యాలయ నంబర్‌ అధికారి సెల్‌ నంబర్‌

నెల్లూరు 0861–2331051 99637 34284

కావలి 08626–243101 99637 34286

ఉదయగిరి 08620–229251 99637 35314

ఆత్మకూరు 08627–221222 99637 34394

కందుకూరు 08598–223399 99637 33252

మరిన్ని వార్తలు