రెండోరోజూ ఏసీబీ తనిఖీలు

28 Apr, 2023 00:20 IST|Sakshi
మాట్లాడుతున్న ఏసీబీ డీఎస్పీ మోహన్‌

కందుకూరు : స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రెండు రోజుల పాటు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం మొదలైన తనిఖీలు గురువారం సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగాయి. కార్యాలయంలో అనధికార నగదు లావాదేవీలు, ప్రైవేట్‌ వ్యక్తుల ప్రమేయం, అధికారుల అవినీతి వ్యవహారాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటిపై సబ్‌రిజిస్ట్రార్‌ సుల్తాన్‌బాషా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మోహన్‌ విలేకరులతో మాట్లాడుతూ అధికంగా ఫిర్యాదులు రావడం వల్లే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై దాడులు చేశామన్నారు. రెండు రోజులపాటు జరిగిన దాడుల్లో ఉన్నం సతీష్‌ అనే డాక్యుమెంట్‌ రైటర్‌ నుంచి రూ.97 వేలు, సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద పనిచేసే ఆఫీస్‌ సబార్టినేట్‌ ఫయాజ్‌ ఫోన్‌ నుంచి రూ.1.30 లక్షలు సబ్‌రిజిస్ట్రార్‌కు బదిలీ చేసినట్లు గుర్తించామన్నారు. అలాగే సబ్‌రిజిస్ట్రార్‌ బ్యాంకు అకౌంట్‌కు దాదాపు రూ.3 లక్షల వరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. వీటిపై వారు సరైన సమాధానం చెప్పడం లేదని, ఈ లావాదేవీలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సి ఉందన్నారు. అలాగే సబ్‌రిజిస్ట్రార్‌ బ్యాంకు అకౌంట్‌లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉందన్నారు.

ప్రైవేట్‌ వ్యక్తులదే రాజ్యం

కార్యాలయంలో ప్రభుత్వ సిబ్బంది కంటే ప్రైవేట్‌ వ్యక్తులే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు గుర్తించామని డీఎస్పీ తెలిపారు. డాక్యుమెంట్‌ రైటర్లు కార్యాలయ ఆవరణలో ఉండకూడదని, అయినా వారంతా కార్యాలయ ఆవరణలోనే ఉంటున్నట్లు గుర్తించామన్నారు. కార్యాలయంలో మొత్తం నాలుగు సీసీ కెమెరాలు ఉంటే వాటిలో కేవలం రెండు మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిపారు. వీటిలో కార్యాలయం లోపల ఉన్న సీపీ కెమెరాను పరిశీలించినప్పుడు రికార్డు కావడం లేదని తెలిసిందన్నారు. రికార్డు కాకుండా సీసీ కెమెరాకు ఫ్లెక్సీని అడ్డుగా కట్టారని, దీనిని కూడా నేరంగా పరిగణిస్తున్నామన్నారు.

అధికారుల అదుపులో సబ్‌ రిజిస్ట్రార్‌

సబ్‌ రిజిస్ట్రార్‌ సుల్తాన్‌బాషాతో పాటు, కార్యాలయంలో పనిచేసే సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌లను ఏసీబీ అధికారులు తమ అదుపులో తీసుకున్నారు. వాస్తవానికి దాడుల కంటే ముందు నుంచే సబ్‌ రిజిస్ట్రార్‌ సెలవులో ఉన్నారు. కానీ ఆయన టేబుల్‌ డెస్క్‌లో రూ.41 వేలు దొరకడం, ఆన్‌లైన్‌ నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించడంతో అధికారులు ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతానికి వీరి అరెస్టుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని డీఎస్పీ తెలిపారు. తనిఖీల అనంతరం సబ్‌ రిజిస్ట్రార్‌ను నెల్లూరుకు తరలించారు.

తప్పించుకున్న కీలక వ్యక్తి

ఈ అవినీతి వ్యవహారంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రతిరోజు డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి సాయంత్రానికి డబ్బులు వసూలు చేసుకు రావడం, లంచాల రూపంలో వచ్చిన నగదును జాగ్రత్త చేసి అధికారులకు అప్పజెప్పడం ఇతని పని. కాగా అతని కోసం ఏసీబీ అధికారులు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే డాక్యుమెంట్‌ రైటర్లు రెండో రోజు కూడా కనిపించకుండా పోయారు.

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో

విస్తృతంగా తనిఖీలు

రూ.5 లక్షలకు పైగా అనధికార లావాదేవీల గుర్తింపు

అధిక ఫిర్యాదుల వల్లే దాడులు చేశామన్న ఏసీబీ డీఎస్పీ మోహన్‌

మరిన్ని వార్తలు