వైభవంగా చిన్న గంధ మహోత్సవం

25 Sep, 2023 00:18 IST|Sakshi
గంధ మహోత్సవానికి హాజరైన భక్తులు

అనుమసముద్రంపేట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏఎస్‌పేటలోని హజరత్‌ ఖాజానాయబ్‌ రసూల్‌ దర్గాలో హబీబ్‌ ఖాతున్నీసా(దొరసానమ్మ) వారి చిన్న గంధ మహోత్సవాన్ని శనివారం అర్ధరాత్రి వైభవంగా నిర్వహించారు. తొలుత సంప్రదాయబద్ధంగా ముతవల్లీ సజ్జదా హఫీజ్‌పాషా గంధ కలశాన్ని తలపై పెట్టుకుని మహల్‌ నుంచి ఊరేగింపుగా దర్గాకు తీసుకొచ్చారు. అనంతరం దొరసానమ్మ, హజరత్‌ ఖాజానాయబ్‌ రసూల్‌ వార్ల సమాధులకు గంధాన్ని లేపనం చేసి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం గంధాన్ని భక్తులకు పంచిపెట్టారు. దొరసానమ్మ గంధ మహోత్సవానికి మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో దర్గా ఆవరణం కిక్కిరిసిపోయింది. సంగం సీఐ రవినాయక్‌ ఆధ్వర్యంలో ఎస్సై నరేష్‌ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతిఒక్కరికీ గంధం అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రశాంతంగా గంధ మహోత్సవం ముగియడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు