నిబంధనల ప్రకారం రేషన్‌ సరఫరా

18 Nov, 2023 00:08 IST|Sakshi
వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడుతున్న డీఏఓ సత్యవాణి

సివిల్‌ సప్లైస్‌ డీఎం నరసింహారావు

నెల్లూరు(పొగతోట): గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి చౌకదుకాణాలకు నిబంధనల ప్రకారం రేషన్‌ సరఫరా చేయాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ పీవీ నరసింహారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నెల్లూరులోని జిల్లా పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో ఎంఎల్‌ఎస్‌ డీటీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చౌకదుకాణాలకు సకాలంలో రేషన్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ హాస్టల్స్‌కు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏఎం టెక్నికల్‌ లక్ష్మీనారాయణ, అకౌంట్స్‌ ఆఫీసర్‌ సురేంద్ర, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ డీటీలు పాల్గొన్నారు.

రైతులకు అందుబాటులో ఉండాలి

డీఏఓ సత్యవాణి

నెల్లూరు(సెంట్రల్‌): జిల్లాలోని రైతాంగానికి వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి పేర్కొన్నారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇరిగేషన్‌ అధికారులు పలు విషయాల్లో తమకు సమాచారం ఇవ్వడం లేదని వ్యవసాయశాఖ అధికారులు డీఏఓ దృష్టికి తీసుకెళ్లారు. సత్యవాణి స్పందిస్తూ రెండు శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బందులు లేకుండా ముందుకెళదామని సూచించారు.

అదనపు ట్రాక్‌

ఏర్పాటుకు పరిశీలన

బిట్రగుంట: బిట్రగుంట రైల్వే యార్డ్‌లో అదనపు ట్రాక్‌ ఏర్పాటుకు సంబంధించి డివిజన్‌కు చెందిన వివిధ విభాగాల సీనియర్‌ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ప్రధానమంత్రి గతిశక్తి పథకంలో భాగంగా కోచ్‌ చెకింగ్‌ ఫెసిలిటీకి అవసరమైన అదనపు ట్రాక్‌ ఏర్పాటుపై డివిజన్‌కు చెందిన పలువురు సీనియర్‌ డీఈలు, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు బిట్రగుంట యార్డ్‌లోని ఎగువ, దిగువ మార్గాలను పరిశీలించారు. ఎగువ, దిగువ మార్గాల్లో వెళ్లే గూడ్సు రైళ్ల నిర్వహణ, చిన్న తరహా మరమ్మతులు చేసేందుకు వీలుగా కోచ్‌ చెకింగ్‌ ఫెసిలిటీ కోసం అదనపు ట్రాక్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు రూ.12 కోట్ల వ్యయంతో యార్డ్‌లో అదనపు ట్రాక్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

మద్యంషాపు సిబ్బందిపై వేటు

విడవలూరు: మండల కేంద్రమైన విడవలూరులోని ప్రభుత్వ మద్యం షాపులో పనిచేస్తున్న సూపర్‌వైజర్‌, ఇద్దరు సేల్స్‌మెన్‌పై వేటు పడింది. ఎకై ్సజ్‌ సీఐ రామారావు తెలిపిన వివరాల మేరకు.. విడవలూరులోని మద్యం దుకాణంలో అవకతవకలు జరుగుతున్నాయని ఎకై ్సజ్‌ సీఐ దృష్టికి రావడంతో గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో మద్యం సేల్స్‌కు సంబంధించిన నగదు లావాదేవీల్లో రూ.46 వేలు వ్యత్యాసం కనిపించింది. దీంతో విచారణ జరిపి సూపర్‌వైజర్‌తో పాటు సేల్స్‌మెన్‌ను విధుల నుంచి తొలగించారు. ఆయన వెంట ఎస్సై రాఘవయ్య, ఎకై ్సజ్‌ సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు