అధికారులు ఉదారంగా వ్యవహరించండి

6 Dec, 2023 00:50 IST|Sakshi
పునరావాస కేంద్రంలో చిన్నారులకు బిస్కెట్లు అందజేస్తున్న మంత్రి కాకాణి

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి

పొదలకూరు : మిచాంగ్‌ తుపాను ప్రభావం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందివ్వడంలో అధికారులు ఉదారంగా వ్యవహరించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి డాక్టర్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు జెడ్పీహైస్కూల్‌, శివాలయం వీధి పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి కాకాణి మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో నిమ్మతోటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా సమాచారం అందిందని, ఉద్యానాధికారులు పరిహారం అందించేందుకు ఎన్యుమరేషన్‌ చేపట్టే సమయంలో రైతులకు సహకారం అందించి ఉదారతను చాటుకోవాల్సిందిగా సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారుల సహకారంతో తుపాను వల్ల ప్రాణనష్టం కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారని, బాధితులను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. పునరావాసంలో ఉన్న వారిని కుటుంబానికి రూ.2,500, ఒక్కరికై తే రూ.1000 అందజేయాల్సిందిగా సూచించారు. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చిన వారికి 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, పామాయాల్‌ ప్యాకెట్‌, ఆలుగడ్డలు అందజేయాల్సిందిగా తహసీల్దార్‌ను ఆదేశించారు. కాలనీల్లో సిమెంటురోడ్లు, సైడ్‌డ్రెయిన్లు పెద్ద ఎత్తున నిర్మించడం వల్ల చాలావరకు ఇళ్లలోకి వర్షపు నీరు రాలేదన్నారు. మంత్రి వెంట తహసీల్దార్‌ కె.వీరవసంతరావు, ఎంపీడీఓ నగేష్‌కుమారి, ఏఈలు కసనానాయక్‌, శివమోహన్‌, డాక్టర్‌ కావ్య, నాయకులు కోనం చినబ్రహ్మయ్య, వాకాటి శ్రీనివాసులురెడ్డి, శేఖర్‌బాబు, అంజాద్‌, మద్దిరెడ్డి రణారెడ్డి, జి.శ్రీనివాసులు, శివశంకర్‌ ఉన్నారు.

>
మరిన్ని వార్తలు