పెనుకొండ టీడీపీ టికెట్‌ సవితమ్మకేనా.. బీకే అవుట్!

28 Mar, 2023 01:28 IST|Sakshi

సాక్షి, పుట్టపర్తి/పెనుకొండ: నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర టీడీపీకి ఊపు తెస్తుందని ఆపార్టీ నేతలు భావిస్తుండగా...క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎక్కడ కూడా ఊహించిన స్థాయిలో ‘స్పందన’ రాకపోగా, తమ్ముళ్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. దీంతో ‘కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోయిందన్న’ చందంగా ‘యువగళం’ సాగుతోంది.

సభ అంతా స్థానికేతరులే..
కదిరి, పుట్టపర్తి తర్వాత యువగళం పాదయాత్ర సోమవారం పెనుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పెనుకొండలో ముగ్గురు నేతలు ఉండటమే కాకుండా వారి మధ్య సమన్వయం లేకపోవడంతో ‘యువగళం’ పాదయాత్రకు స్పందన కరువైంది. ఈ క్రమంలోనే పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. ఎకరా స్థలంలో సభ ఏర్పాటు చేసినా జనాలు నిండకపోవడం గమనార్హం. ఉన్న వారిలో సగం మందికి పైగా నిత్యం నారా లోకేశ్‌ వెంట ఉండేవారే. కొత్తగా జనాలు రాకపోవడంపై నియోజకవర్గ నాయకులతో ఆయన ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. డబ్బు, మద్యం, పెట్రోల్‌ పంపిణీ చేసినా రాకపోవడం ఏంటనే దానిపై బీకే పార్థసారథి సెకండ్‌ క్యాడర్‌పై మండిపడ్డారని తెలిసింది. గోరంట్లకు వచ్చిన వారిలో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల ప్రజలు కూడా కొందరు ఉండటం విశేషం.

ఎవరికి వారే యమునా తీరే..
యువగళం పెనుకొండ నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి నిమ్మల కిష్టప్ప, సవితమ్మ, బీకే పార్థసారథి ఎవరికి వారుగా వ్యవహరించారు. పైగా నియోజకవర్గంలో సభలు సక్సెస్‌ అయితే తమ పరిస్థితి ఏమిటని మిగతా నేతలు ఆలోచించడంతో పరిస్థితి తారుమారైంది. నిమ్మల కిష్టప్ప సొంత మండలం గోరంట్ల కావడంతో.. బీకే ప్లాన్‌లు బెడిసికొట్టాయి. అంతేకాకుండా బీకే ఎత్తులకు పైఎత్తులు వేసేందుకు సవితమ్మ మరో టీంను రెడీ చేసినట్లు సమాచారం.

ఎత్తుకు పైఎత్తు..
సవితమ్మ ఎక్కడ లోకేశ్‌కు దగ్గరై తన టికెట్‌కు ఎసరు పెడుతుందోనని భావించిన బీకే పార్థసారథి ఆద్యంతం లోకేశ్‌ వెంటే నడిచారు. బహిరంగ సభలోనూ ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీనికి పోటీగా సవితమ్మ వర్గం భారీ హంగామా చేసింది. సవితమ్మతో పాటు ఆమె భర్త కూడా పాదయాత్రలో లోకేశ్‌ను అనుసరిస్తూ అనేక సూచనలు చేస్తున్నారు. పాదయాత్ర తాము చేపడుతున్న అన్నా క్యాంటీన్‌ మీదుగా నడిపి లోకేశ్‌ చేతుల మీదుగా భోజనాలు వడ్డించాలని సవితమ్మ వర్గం భావించింది. ఈమేరకు లోకేశ్‌కు ఈ విషయం వెల్లడించగా ఆయన ఓకే అన్నట్లు ఆ వర్గం చెబుతోంది. కానీ బీకే వర్గం మాత్రం నిర్దేశించిన మేరకే హైవే మీదుగా పాదయాత్ర కొనసాగిద్దామని వివరించినట్లు తెలుస్తోంది.

బీకేకు టికెట్‌ డౌటే..
నారా లోకేశ్‌ ప్రసంగంలో బీకే పార్థసారథిని గెలిపించాలని ఎక్కడా పిలుపునివ్వలేదు. టీడీపీని గెలిపించండి.. టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్పారు. లోకేశ్‌ ప్రసంగం చూస్తే బీకే పార్థసారథికి పెనుకొండ టికెట్‌ అనుమానమే అనిపిస్తోంది.

స్పందన కరువు..
గోరంట్ల:
లోకేష్‌ పాదయాత్ర సోమవారం ఉదయం 9 గంటలకు రెడ్డిచెరువుకట్ట గ్రామం నుంచి ప్రారంభమై, చలమయ్యగారిపల్లి, చింతమానుపల్లి, జీనంవాడ్లపల్లి, గోరంట్ల మీదుగా గుమ్మయ్యగారిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక వరకు కొనసాగింది. అయితే ఎక్కడా పెద్దగా స్పందన కనిపించలేదు. మధ్యాహ్నం భోజన విరామంలో దీనిపై లోకేష్‌ స్థానిక నేతలను మందలించినట్లు తెలుస్తోంది. కనీసం జన సమీకరణ కూడా చేతకాకపోతే ఎలా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో నేతలు అప్పటికప్పుడు పొరుగున ఉన్న నియోజకవర్గాల నుంచి తెలుగు తమ్ముళ్లను డబ్బు, మద్యం ఇచ్చి తరలించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు