అపూర్వ ‘స్పందన’

29 Mar, 2023 00:48 IST|Sakshi
స్పందనలో అర్జీలు స్వీకరిస్తున్న పోలీసు అధికారులు

సాక్షి, పుట్టపర్తి: పుట్టపర్తి పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. సమస్యలు ఓపిగ్గా విని అర్జీలు స్వీకరించిన అధికారులు, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా ప్రజల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. గతంలో అనంతపురం జిల్లా కేంద్రం వెళ్లాలంటే వ్యయ ప్రయాసలు భరించాల్సి వచ్చేది. కొత్త జిల్లా ఏర్పడ్డాక పుట్టపర్తికి రాకపోకలు సులువయ్యాయి. దీంతో ఎలాంటి సమస్య వచ్చినా జిల్లాకేంద్రంలో నిర్వహించే ‘స్పందన’కు వచ్చి ప్రజలు అర్జీలు సమర్పిస్తున్నారు.

ప్రభుత్వ ఆశయాలకనుగుణంగా..

ప్రతి వారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ‘స్పందన’కు ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, భూ ఆక్రమణలు, దోపిడీలు, చోరీలు, నేరాలు, అనుమానాస్పద మృతులపై ఫిర్యాదులు, హత్యలు, ఉద్యోగాల పేరుతో టోకరా, సైబర్‌ నేరాలు తదితర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, చోరీలకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. ప్రభుత్వ ఆశయాల కనుగుణంగా ‘స్పందన’కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న అధికారులు కిందిస్థాయి సిబ్బందితో నేరుగా మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తున్నారు. పలు కేసుల్లో ఇరు వర్గాలను పిలిచి రాజీ కుదిర్చి సంతోషం పంచుతున్నారు.

98 శాతం పరిష్కారం..

జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ (మార్చి 27) పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 2,254 ఫిర్యాదులు అందాయి. వాటిలో 98 శాతం మేర అంటే సుమారు 2,100 సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగతా ఫిర్యాదుల్లో స్పష్టత లేకపోవడంతో వీగిపోయినట్లు జిల్లా పోలీసు కార్యాలయంలోని ‘స్పందన’ సిబ్బంది ద్వారా తెలిసింది.

కష్టాలు తీరుస్తున్న పోలీసులు

ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు

గతంలో ‘అనంత’ వెళ్లాలంటే

వ్యయప్రయాసలు

నేడు పుట్టపర్తికి సులువుగా

రాకపోకలతో జనం ఆనందం

మరిన్ని వార్తలు