రాష్ట్ర స్థాయి వృషభాల బల ప్రదర్శన పోటీలు రేపు

29 Mar, 2023 00:48 IST|Sakshi
మృతి చెందిన చంద్రశేఖర్‌ నాయక్‌

రాప్తాడు: రాప్తాడులో ఈ నెల 30న రాష్ట్ర స్థాయి వృషభాల బల ప్రదర్శన (రాతి దూలం లాగుడు పోటీలు) పోటీలు నిర్వహిస్తున్నట్లు లక్ష్మీ పండమేటి రాయుడు ఆలయ పాలక మండలి సభ్యులు తెలిపారు. ఉదయం 8 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన ఎద్దుల యజమానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి రూ.60 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన ఎద్దుల యాజమానికి ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌ రెడ్డి రూ.50 వేలు, తృతీయ స్థానం–ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మీ రూ.40 వేలు, నాల్గో స్థానం– జెడ్పీటీసీ సభ్యురాలు పసుపుల హేమావతి రూ.30 వేలు, ఐదో స్థానం–ఆలయ కమిటీ అధ్యక్షుడు గంజి రాముడు రూ.20 వేలు పంపిణీ చేస్తారని తెలిపారు. పాల్గొనదలచిన వారు 81069 46853, 9440088531, 8639828818 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

తాడిపత్రి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని బొందలదిన్నె గ్రామం వద్ద మంగళవారం జరిగింది. వివరాలు.. బొందలదిన్నెకు చెందిన కోటా ప్రతాప్‌రెడ్డి (42) మంగళవారం గ్రామానికి సమీపంలోని వంగనూరుకు పని నిమిత్తం ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బొందలదిన్నె వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయాడు. అదే సమయంలో కడప వైపు నుంచి తాడిపత్రి వైపు వస్తున్న ఉరవకొండకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీ కొన్నాడు. తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదంపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బొలెరో ఢీకొని కార్మికుడి మృత్యువాత

గోరంట్ల: మండల పరిధిలోని బూడిదగడ్డపల్లి సమీపంలో కొడూరు–గోరంట్ల ప్రదాన రహదారిపై మంగళవారం బొలేరో వాహనం ఢీకొని కరావులపల్లి తండా గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ నాయక్‌ (32) అనే కార్మికుడు మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చంద్రశేఖర్‌ నాయక్‌ విధి నిర్వహణలో భాగంగా సొంత గ్రామమైన కరావులపల్లి తండా నుంచి తన ద్విచక్రవాహనంలో బూదిలి సమీపంలోని లెదర్‌ కంపెనీకి బయలుదేరాడు. బూడిదగడ్డపల్లి సమీపంలో గోరంట్లకు వస్తున్న బొలేరో వాహనం బైకును ఢీకొంది. ఘటనలో చంద్రశేఖర్‌నాయక్‌ అక్కడిక్కడే మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

తాడిమర్రి: మండల పరిధిలోని నార్శింపల్లిలో మంజుల రామాంజినేయులు కుమారుడు నరేంద్ర (16) సోమవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన మంజుల రామాంజినేయులు, రాజేశ్వరి దంపతుల కుమారుడు నరేంద్ర 8వ తరగతి వరకు చదువుకుని బడి మానేశాడు. తండ్రి పక్షవాతంతో బాధపడుతుండడంతో రాళ్లు కొట్టే పనులకు వెళ్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. ఇటీవల పనులకు సక్రమంగా వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన నరేంద్ర సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నాడు. బయట నిద్రిస్తున్న తల్లిదండ్రులకు రాత్రి 10 పది గంటల సమయంలో ఇంట్లో వస్తువులు పడిపోయినట్లు శబ్దం రావడంతో తలుపులు తీయడానికి ప్రయత్నించారు. తెరుచుకోకపోవడంతో కిటికీల నుంచి చూడగా నరేంద్ర ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే తలుపులు బద్దలు కొట్టి యువకుడిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిగా తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.

మరిన్ని వార్తలు