లోకేష్‌.. దమ్ముంటే చర్చకు రా!

29 Mar, 2023 00:48 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ

పెనుకొండ: ‘‘నాలుక మందం మందళగిరి లోకేష్‌... ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. లేదంటే ప్రజలే నిన్ను తరిమి కొడతారు’’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ హెచ్చరించారు. మంగళవారం ఆయన పట్టణంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పరిటాల శ్రీరాములు పెనుకొండ ప్రాంతంలో భూములు పంచాడని, ఈ ప్రాంతం పరిటాల పోరుగడ్డ అంటూ లోకేష్‌ బహిరంగ సభలో ఏదేదో మాట్లాడాడని, అయితే రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలానికి చెందిన పరిటాల శ్రీరాములుకు ఈ ప్రాంతంతో ఉన్న సంబంధం ఏంటో అతనే చెప్పాలన్నారు. పరిటాల రవి పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో జరిగిన హత్యాకాండ గురించి లోకేష్‌ తెలుసుకోవాలన్నారు.

నీ స్థాయి ఏమిటో తెలుసుకో

సీఎం జగన్‌ నవరత్నాల పథకాలు పకడ్బందీగా అమలు చేస్తూ జనరంజక పాలన అందిస్తుండటంతో ప్రజలకు ప్రతిపక్షంతో పనిలేకుండా పోయిందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని లోకేష్‌ జనం వద్ద సానుభూతి కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని శంకరనారాయణ మండిపడ్డారు. జగనన్నను విమర్శిస్తే జనమే తరిమికొడతారన్న విషయం తెలుసుకోవాలన్నారు. జగనన్నను విమర్శించే ముందు లోకేష్‌ తన స్థాయి ఏమిటో తెలుసుకోవాలన్నారు. 151 సీట్లు గెలిచి సీఎం అయిన జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడ.... దొడ్డిదారిన మంత్రి పదవి పొందిన నువ్వెక్కడ..? ఇంకోసారి జగన్‌మోహన్‌రెడ్డి గురించి నోరు జారితే తోలు తీస్తాం జాగ్రత్త... అని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ‘యువగళాన్ని’ అడ్డుకుంటున్నాడని లోకేష్‌ ప్రగల్భాలు పలుకుతున్నాడని, జగనన్న కనుసైగ చేస్తే చాలు జనం నీ బట్టలూడదీసి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలుసుకోవాలని హితవు పలికారు.

అభివృద్ధిలో అనకొండనే..

తనను పెనుకొండ అనకొండనని లోకేష్‌ విమర్శించాడని, తాను నిజంగా అనకొండనేనని శంకరనారాయణ తెలిపారు. అభివృద్ధిలో, సంక్షేమంలో, కార్యకర్తలను కాపాడుకోవడంలో తాను నిజంగా అనకొండనేనన్నారు. టీడీపీ నాయకుల్లా మందు కోసం, సమయం కోసం వేచి చూడడం తన నైజం కాదన్నారు. పెనుకొండ అభివృద్ధి రూ. వందల కోట్లలో జరిగిన విషయాన్ని లోకేష్‌ కళ్లు తెరిచి చూడాలన్నారు. ఆర్‌అండ్‌బీ నుంచి రూ.253 కోట్లు, పీఆర్‌ నుంచి రూ.69 కోట్లు, మెడికల్‌ కళాశాలకు రూ. 475 కోట్లు, రొద్దంలో బీసీ స్కూల్‌కు రూ. 15 కోట్లు, బాబయ్య దర్గాకు రూ.4 కోట్లు, షీఫారానికి రూ. 2 కోట్లు, అదే విధంగా 81 సచివాలయాలు, 70 ఆర్బీకేలు, 61 వెల్‌నెస్‌ సెంటర్లు, 39 మిల్క్‌చిల్‌ సెంటర్లు, 24 డిజిటల్‌ లైబ్రరీలకు సంబంధించి రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 2014లో టీడీపీ నేతలంతా కలిసి బాబొస్తే జాబొస్తుందని నమ్మించారని, తీరా బాబు అధికారంలోకి వచ్చాక మందళగిరి లోకేష్‌కు మాత్రమే జాబొచ్చిందని ఎద్దేవా చేశారు. జగనన్న ముఖ్యమంత్రి కాగానే 1.36 లక్షల సచివాలయ ఉద్యోగాలు, గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, పోలీస్‌ ఉద్యోగాలు, 40 వేల మెడికల్‌ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలుసన్నారు. మైకు దొరికిందని అబద్దాలు చెబితే ప్రజలు నమ్మరన్నారు.

దమ్ముంటే చర్చకు రా...లెక్కలు తీద్దాం

తాను అధికారంలోకి వచ్చాకేదో సంపాదించానని లోకేష్‌ ఆరోపించారని, అతనికి దమ్ముంటే ఉమ్మడి జిల్లా దాటేలోపు దీనిపై బహిరంగ చర్చకు రావాలని శంకరనారాయణ సవాల్‌ విసిరారు. ‘లోకేష్‌... మీ తాత ఖర్జూర నాయుడుది 2 ఎకరాల చరిత్ర, మా తాత కొండప్ప 50 ఎకరాల భూస్వామి’ ఈ విషయం మీ చెంచాలను ఎవరిని అడిగినా చెబుతారన్నారు. లేదా నువ్వే ఎంక్వయిరీ చేయించుకో అని సలహా ఇచ్చారు. తన తండ్రి, తాను రాజకీయ జీవితంలో రూ.వందల కోట్ల విలువైన భూములు పోగొట్టుకున్నామన్నారు. ఆ భూములు ఎక్కడ , ఎవరికి విక్రయించామో చూపిస్తా....రా అంటూ లోకేష్‌కు సూచించారు. మీ తాతల నుంచి నీకు వచ్చిన ఆస్తులు...మీరు చేసిన వ్యాపారాలు...మాకున్న ఆస్తులు..మేము చేసిన పనులపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. తన కుటుంబంపై అవాకులు చవాకులు పేలితే నాలుక చీరేస్తానని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, వైఎస్సార్‌ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు బోయ నరసింహ, నాగలూరు బాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెనుకొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కనిపించలేదా?

మీ తాతది 2 ఎకరాల చరిత్ర...

మాది 50 ఎకరాల చరిత్ర

నా కుటుంబం గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా

జగనన్నను విమర్శిస్తే ప్రజలే

నిన్ను తరిమి కొడతారు జాగ్రత్త

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శంకరనారాయణ హెచ్చరిక

మరిన్ని వార్తలు