ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

30 Mar, 2023 00:44 IST|Sakshi
బ్రాహ్మణపల్లి వద్ద బావిలో పడ్డ ట్రాక్టర్‌

ధర్మవరం అర్బన్‌: కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని సాయినగర్‌లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సాయినగర్‌కు చెందిన నాగరాజు(35) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇతడికి భార్య పార్వతి, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కొంత కాలంగా నాగరాజుకు, భార్యకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన నాగరాజు బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. గుర్తించిన కుటుంబస భ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వ్యక్తి బలవన్మరణం

పెనుకొండ రూరల్‌: రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణం పొందిన ఘటన స్థానిక పెనుకొండ – మడకశిర రహదారి రైల్వే పట్టాల వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకొంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం పావగడ తాలుక రాగికుంటకి చెందిన బోయ అంజినప్ప (70) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం ఉదయం దాదాపు 10 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం సాయంత్రం పెనుకొండ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ముత్యాలమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

హిందూపురం: బస్సు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన హిందూపురం– బెంగళూరు రోడ్డులో చిన్న మార్కెట్‌ వద్ద బుధవారం జరిగింది. టూటౌన్‌ పోలీసులు తెలిపిన మేరకు.. చిన్న మార్కెట్‌ ప్రాంతానికి చెందిన వెన్నితన్‌ (78) రోడ్డు దాటుతుండగా, పారిశ్రామికవాడకు చెందిన గార్మెంట్‌ బస్సు ఢీకొంది. కింద పడిన వృద్ధుడి తలపై నుంచి బస్సు టైర్‌ వెళ్లడంతో నుజ్జునుజ్జయింది. బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. వృద్ధుడి కుమారుడు నవీన్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

బావిలో పడిన ట్రాక్టర్‌

పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్‌

పుట్టపర్తి టౌన్‌: బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద ఓ ట్రాక్టర్‌ బావిలో పడింది. డ్రైవర్‌ పక్కకు దూకడంతో పెనుప్రమాదం తప్పింది. వివరాలు.. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో బుధవారం చంద్రశేఖర్‌రెడ్డి అనే రైతు తన పొలంలో పాడుబడ్డ బావిని పూడ్చుతున్నాడు. మట్టి వేసుకొన్న ట్రాక్టర్‌ వెనుకకు వెళ్లే క్రమంలో అదుపుతప్పి 30 అడుగుల లోతున్న బావిలో పడింది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్‌ రాజశేఖర్‌ చాకచక్యంగా పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. స్థానికులు, యజమాని ఊపిరి పీల్చుకొన్నారు.

బాబాయిపై పెట్రోల్‌ పోసి నిప్పు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

కదిరి టౌన్‌: కదిరి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సొంత బాబాయిపైనే ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని యర్రగుంటపల్లికి చెందిన నాగప్ప నాయుడుకు, ఆయన అన్న కుమారుడు శ్రీనివాసులు నాయుడుకు మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఘర్షణ చోటుచేసుకోగా.. విషయాన్ని నాగప్పనాయుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోపం పెంచుకున్న శ్రీనివాసుల నాయుడు మంగళవారం సాయంత్రం డిగ్రీ కళాశాల సమీపంలో ద్విచక్రవావానంపై వెళ్తున్న నాగప్పనాయుడుపై పెట్రోల్‌ చల్లి నిప్పుంటించాడు. స్థానికులు మంటలను ఆర్పి వెంటనే అతన్ని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమంచి ప్రాణాలు వదిలాడు.

టీకాల పంపిణీలో

అలసత్వం వద్దు

తాడిమర్రి: చిన్నారులకు వేసే వ్యాధి నిరోధక టీకాలపై అలసత్వం వద్దని జిల్లా ఇమ్యూనిటీ అధికారి కృష్ణయ్య వైద్య సిబ్బందికి సూచించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. టీకాలు నిల్వ చేసిన ఫ్రిజ్‌, కూలర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాల పరిధిలో ప్రతి బుధ, శనివారాల్లో చిన్నారులకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలన్నారు. గర్భిణులకు ప్రతి నెలా వేయాల్సిన టీకాలు వేస్తూ, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి మహేంద్రనాథ్‌, డాక్టర్‌ జ్యోతిర్మయి, ఎంపీహెచ్‌ఎస్‌లు రమణ, రామ్‌కుమార్‌, ఆరోగ్య కార్యకర్త జానకిరాయుడు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు