పుట్టపర్తిలో అంబేడ్కర్‌ భవన్‌

30 Mar, 2023 00:44 IST|Sakshi

పుట్టపర్తి అర్బన్‌: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాలులో జిల్లా స్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌, ఎమ్మెల్యే తిప్పేస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ చేతన్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులపై అప్రమత్తత అవసరమన్నారు. జిల్లా కేంద్రం పుట్టపర్తిలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భవన్‌ నిర్మాణం కోసం స్థల సేకరణ చేపట్టాలన్నారు. ఇందుకోసం కనీసం రెండు ఎకరాలు ఉండాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ శ్మశాన వాటిక ఉండేలా చూడాలన్నారు. ఇందుకు అవసరమైన భూమిని గుర్తించాలన్నారు. గ్రామాల్లో విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలన్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలించాలి..

ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు. సమావేశంలో సభ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

శ్మశాన వాటికలకు స్థలం కేటాయించాలి..

ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ, మడకశిర నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలకు స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మండల స్థాయి అధికారులు విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాలకు రావడం లేదన్నారు. అమరాపురం మండలంలో అర్హులను గుర్తించి పొజిషన్‌ సర్టిఫికెట్‌ అందజేసి ఇల్లు కేటాయించారని, అయితే ఆ స్థలంలో వర్షపునీరు చేరడంతో లబ్ధిదారులు కమ్యూనిటీ హాలులో తలదాచుకుంటున్నారన్నారు. వారికి మరో చోట స్థలం కేటాయించాలన్నారు. సమావేశంలో పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ శివరంగప్రసాద్‌, ఆర్డీఓలు భాగ్యరేఖ, తిప్పేనాయక్‌ రాఘవేంద్ర, సీపీఓ విజయ్‌కుమార్‌, డీఎస్పీలు యశ్వంత్‌, భవ్యకిశోర్‌, ఉమామహేశ్వరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, అగ్రికల్చర్‌ ఏడీ విద్యావతి, డీటీడబ్ల్యూఈ మోహన్‌రాము, కమిటీ మెంబర్లు నరసింహమూర్తి, శ్రీనివాసులు, గంగులయ్య, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

స్థల సేకరణపై అధికారులు

దృష్టి సారించాలి

‘అట్రాసిటీ’ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌

మరిన్ని వార్తలు