హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

20 Nov, 2023 00:20 IST|Sakshi

కదిరి టౌన్‌: కదిరిలోని నిజాంవలీ కాలనీలో ఈ నెల 14న చోటు చేసుకున్న హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలను ఆదివారం సీఐ నారాయణరెడ్డి వెల్లడించారు. నిజాంవలీ కాలనీలోని పుట్టగడ్డ వీధిలో నివాసముంటున్న ఆటో డ్రైవర్‌ రామాంజనేయులు ఇంట్లో ఈ నెల 14న డేరంగుల శ్రీకాంత్‌ను హత్య చేసిన విషయం తెలిసిందే. రామాంజనేయులు భార్యపై కన్నేసిన శ్రీకాంత్‌ తరచూ తన కోరిక తీర్చమంటూ ఆమెను వేధింపులకు గురిచేస్తుండేవాడు. ఈ విషయాన్ని భర్తకు బాధితురాలు తెలిపింది. దీంతో పథకం ప్రకారం ఈ నెల 14న శ్రీకాంత్‌ను ఇంటికి ఆహ్వానించిన వారు రోకలి బండతో బాది హతమార్చి పరారయ్యారు. హతుడి భార్య పావని ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఆదివారం పట్టణ శివారులోని కౌలేపల్లి వద్ద ఉన్న దంపతులను గుర్తించి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు