ఐదురోజులుగా ఇంట్లోనే శవమై..

12 Feb, 2024 09:45 IST|Sakshi

శ్రీ సత్యసాయి: కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపురంలోని చామరాజపేట సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌ సమీపాన ఓ ఇంట్లో మహిళ హత్యకు గురైంది. ఐదు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. కాన్వెంట్‌ సమీపాన గల ఇంటిలో దీప (40), మల్లికార్జున్‌ అలియాస్‌ దివాకర్‌ జంట గత జనవరి నెలలో అద్దెకు దిగారు. తాము భార్యాభర్తలమని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన వారిగా ఇంటి యజమాని వద్ద చెప్పారు. దీప ఇంటిపట్టున ఉండగా.. మల్లికార్జున ఒక షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

ఏమైందో తెలియదు గానీ ఈ నెల ఏడో తేదీ నుంచి ఇంటి తలుపులు తీయలేదు. ఆదివారం ఉదయం ఇంటిలోంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని, స్థానికులు కిటికీలో నుంచి చూడగా దీప అచేతనావస్థలో శవంగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి లోనికెళ్లి చూడగా దీప గొంతును కత్తితో కోసినట్లుగా గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ నాగేశ్‌, డీఎస్పీ శివకుమార్‌, సీఐ మంజునాథ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీప భర్తగా చెప్పుకునే మల్లికార్జున కనిపించడం లేదు. అతనే ఆమెను హత్య చేసి పరారయ్యాడా.. లేక ఇంకేమైనా జరిగిందా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega