ముగిసిన శరత్ కాలం..

23 May, 2023 01:14 IST|Sakshi

సాగర సంగమం సంపూర్ణమవ్వాలంటే బాలుకు ఓ రఘుపతి కావాలి. సీతాకోక చిలుక అందంగా ఎగరాలంటే ఆ కథకు డేవిడ్‌ ఉండి తీరాలి. అన్వేషణ అంతం కావాలంటే అడుగడుగునా జేమ్స్‌ కనిపించాలి.     ఆపద్బాంధవుడిలా చిరంజీవి మారాలంటే శ్రీపతి లాంటి ఉత్తముడు రావాలి. అప్పలనరసయ్య సంసారాన్ని చదరంగంలా ఆడాలంటే ప్రకాష్‌ అనే పొగరుబోతు కొడుకు ఇంటిలో తిరగాలి. పనివాడు ముత్తు గొప్పవాడిగా మారాలంటే నిజం తెలుసుకునే జమీందార్‌ అతని కళ్ల ముందుండాలి. ఇన్ని గొప్ప కథలకు, ఇలాంటి కథకులకు వరంలా దొరికిన నటుడు శరత్‌బాబు. ఆమదాలవలసలో పుట్టి పెరిగిన ఈ అందగాడు తెలుగు, తమిళ సినిమాల్లో మర్చిపోలేని పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. వెండితెరపై అందంగా వికసించిన ఆయన నవ్వు ఇప్పుడు మాయమైపోయింది. అర్ధ శతాబ్దం పాటు అప్రతిహతంగా సాగిన నట ప్రస్థానం నేటికి కళామతల్లి పాదాల చెంతకు చేరుకుంది. వంశధార నుంచి మెరీనా తీరం వరకు ఆయన సాగించిన ప్రయాణం సిక్కోలు స్మరించుకుంటోంది.  

ఆమదాలవలస: వంశధార నదీ తీరాన సత్యనారాయణ దీక్షితులుగా ఆడిపాడిన శరత్‌బాబు వేలాది మంది సినిమా అభిమానులను శోకంలో ముంచుతూ శాశ్వత సెలవు తీసుకున్నారు. ఆమదాలవలసకు చెందిన ఆయన రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ముందు చెన్నైలోనే ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. అక్కడి నుంచి బెంగళూరు, మళ్లీ అక్కడి నుంచి హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్టీ ఆర్గాన్స్‌ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్స్‌ ఇష్యూతో ఆయన ఇబ్బంది పడుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. 

ఆమదాలవలసలోనే.. 
శరత్‌బాబు బాల్యం, యవ్వనం ఆమదాలవలసలో నే గడిచింది. ఆయన తండ్రి విజయ్‌శంకర్‌ దీక్షితులు ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి చేసుకుని ఆమదాలవలస వచ్చి స్థిరపడ్డారు.

► శరత్‌బాబు ఇక్కడే పుట్టారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. 13 మంది సంతానంలో శరత్‌బాబు ఒకరు. వీరికి ఆమదాలవలసలో రైల్వేస్టేషన్‌ ఎదురుగా గౌరీ శంకర్‌ విలాస్‌ అనే బ్రాహ్మణ భోజన హొటల్‌ ఉండేది.   

► శరత్‌బాబు ఆమదాలవలసలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని ఇంటర్‌మీడియెట్‌ చదివారు. డిగ్రీ శ్రీకాకుళంలో ఆర్ట్స్‌ కళాశాలలో చదివారు.  

► తిత్లీ తుఫాన్‌ సమయంలో రెండు లక్షల రూపాయలు జిల్లాకు ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆమదాలవలసలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, సంగమేశ్వర దేవాలయాలకు ఒక్కో లక్ష  చొప్పున విరాళాలు అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు.    

 దిగ్భ్రాంతికి గురయ్యా: స్పీకర్‌ 
ఆమదాలవలసకు మంచి పేరు తెచ్చిన నటుడు శరత్‌బాబు మృతి చెందడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఓ ప్రకటనలో తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గంలో, ఆమదాలవలస పట్టణానికి చెందిన సత్యనారాయణ దీక్షితులు అలియాస్‌ శరత్‌ బాబు మృతి చెందిన సమాచారం తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాలలో బీఎస్సీ చదువుకున్న రోజుల్లోనే నటనపై శరత్‌ బాబుకు మక్కువ ఉండేదన్నారు. అప్పట్లో ఆర్ట్స్‌ కళాశాల వార్షికోత్సవంలో ‘వాపస్‌’ నాటకంలో నిరుద్యోగ యువకుడిగా శరత్‌ బాబు వేసిన పాత్ర రక్తి కట్టించిందన్నారు. 44 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఆమదాలవలస పేరు ప్రఖ్యాతలు బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో శరత్‌ బాబు ఒకరిని కొనియాడారు. శరత్‌ బాబు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.    

 తీరని లోటు 
శరత్‌బాబు మృతి అటు సినీ పరిశ్రమకు, ఇటు ఆమదాలవలసకు తీరని లోటని ఆమదాలవలసకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు, రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్‌ జేజే మోహన్‌రావు అన్నారు. శరత్‌బాబుతో తమ కుటుంబానికి స్నేహ సంబంధాలు ఎక్కువగా ఉండేవని జ్ఞాపకం చేసుకున్నారు. చివరిసారిగా ఆమదాలవలసలో అయ్యçప్పస్వామి ఆలయ ప్రతిష్ట సమయంలో ఆయన వచ్చారని చెప్పారు. ఆమదాలవలస పట్టణంలోని గల ప్రధాన రహదారి సింగపూర్‌ రహదారిలా తీర్చిదిద్దుదామని శరత్‌బాబు అన్నారని తెలిపారు. శరత్‌బాబుకు ఆమదాలవలస లో ఎర్నాగుల ప్రభాకరరావు, పీరు యర్రయ్య, రవిబ్రహ్మం అనే స్నేహితులు ఉన్నారని, ప్రస్తుతం వారంతా ఉద్యోగరీత్యా వేరే చోట్ల నివసిస్తున్నారని తెలిపారు.  

సంగమయ్య ఆలయానికి విరాళం 
ఆమదాలవలస రూరల్‌: ఆమదాలవలస మండలంలోని సంగమేశ్వర కొండకు శరత్‌బాబు తన సొంత ఖర్చుతో ఐదేళ్ల కిందట టైల్స్‌ వేయించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో మొట్టమొదటిగా నిర్వహించే జాతర సంగమేశ్వర జాతర. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందినవారు జనం వచ్చి సంగమయ్య కొండను, గుహలో ఉన్న సంగమయ్యను దర్శించుకుంటారు. అలాంటి సమయాల్లో గుహ లోపలకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు శరత్‌బాబు దృష్టికి తీసుకురావడంతో వెంటనే గుహ లోపల టైల్స్‌ వేయించాలని తన సోదరులకు తెలపడంతో వాటిని అమర్చారు.   

  కలిసి చదువుకున్నాం 
శరత్‌ బాబు మృతి చెందారని తెలియగానే సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయాననే బాధ కలిగింది. నేను, శరత్‌ బాబు ఏడో తరగతి నుంచి కలిసి చ దువుకున్నాం. శ్రీకాకుళం డిగ్రీ ఆర్ట్స్‌ కళాశాలలో ఆయన ఎంపీసీ, నేను సీబీజెడ్‌లో చేరాం. మంచి తెలివైన విద్యారి్థ. క్రమశిక్షణకు మారుపేరు. శరత్‌ బాబు ఒరిజనల్‌ పేరు సత్యనారాయణ దీక్షితులు. ఆయన ముప్పైఏళ్లు వరుసగా అయ్యప్ప మా ల వేశారు. 2019 వరకూ ఎప్పటికప్పుడు మాట్లాడుకునేవాళ్లం. తర్వాత తగ్గింది. 1980 లో నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో టంకాల బాబ్జీ తదితరులు శరత్‌బాబును సత్కరించారు. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి.  
– పీరు ఎర్రయ్య, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్‌   

 

>
మరిన్ని వార్తలు