గనులశాఖ ఏడీ పోస్టు ఎత్తివేత

25 May, 2023 01:06 IST|Sakshi
మాట్లాడుతున్న లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరావు

అరసవల్లి: జిల్లాల విభజన అనంతరం జరిగిన మార్పుల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఇంతవరకు ఉన్న గనుల శాఖ సహాయ సంచాలకులు(ఎ.డి) పోస్టును ఎత్తివేసి.. ఇక్కడే ఉన్న డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టును జిల్లా గనులు, భూగర్భ శాఖాధికారిగా మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1 నుంచే ఉత్తర్వు నంబర్‌ 2 అమల్లోకి వచ్చినట్లు జిల్లా అధికారి ఎస్‌.కె.వి.సత్యనారాయణ బుధవారం తెలిపారు. ప్రస్తుతం రామలక్ష్మణ కూడలి సమీపంలో ఉన్న డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయే ఇప్పడు జిల్లా గనుల శాఖ కార్యాలయంగా మారిందని, ప్రజలు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.

సజావుగా ఐసెట్‌

ఎచ్చెర్ల క్యాంపస్‌: జిల్లాలో ఆన్‌లైన్‌ విధానంలో ఐసెట్‌ – 2023 (ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌టెస్ట్‌) పరీక్షలు బుధవారం సజావుగా ముగిశా యి. చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో మొదటి షిఫ్టులో 165 మంది, రెండో షిఫ్టులో 172 మంది, టెక్కలి ఐతం కాలేజ్‌లో మొదటి షిఫ్టులో 181 మంది, రెండో షిఫ్టులో 179 మంది, ఎచ్చెర్ల వేంకటేశ్వర ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో మొదటి షిఫ్టులో 173 మంది, రెండో షిఫ్టులో 167 మంది హాజరయ్యారు. మొత్తం 1147 మందికి 110 మంది గైర్హాజరయ్యారు.

రైలు కింద పడి వ్యక్తి మృతి

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయంలో బుధవారం రాత్రి రైలు కింద పడి వ్యక్తి మృతిచెందాడు. బరంపురం నుంచి పలాస వైపు వెళ్లే అప్‌ ట్రాక్‌లో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద తలపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి సమయం కావడంతో మృతుడి వివరాలు తెలియలేదు. 45 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి తెల్లచొక్కా, గల్ల లుంగీ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.

నేరాల నియంత్రణకు చర్యలు

ఽశ్రీకాకుళం క్రైమ్‌: నేర నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ జి.ఆర్‌.రాధిక సిబ్బందిని ఆదేశించారు. బుధవారం వార్షిక తనిఖీలో భాగంగా శ్రీకాకుళం ఒకటో పట్టణ సర్కిల్‌ కార్యాలయాన్ని ఎస్పీ సందర్శించారు. గ్రేవ్‌ కేసులు, ప్రాపర్టీ కేసుల్లో రికార్డులను పరిశీలించారు. ముఖ్య కేసులపై సీఐ లెంక సన్యాసినాయుడును అడిగి తెలుసుకున్నారు. సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను గుర్తించాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీ పటిష్టం చేయాలన్నారు. ముఖ్య కూడళ్లు, దుకాణ సముదా యాలు, బ్యాంకులు, దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వాహనాల తనిఖీ నిర్వహిస్తూ అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వై.శృతి, ఎస్పీ సీసీ శివకుమార్‌ ఉన్నారు.

అక్రమ రవాణా అరికట్టాలి

కాశీబుగ్గ: రైళ్లలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని లైన్‌ ఇన్‌స్పెక్టర్‌(విశాఖ) వెంకటరావు సిబ్బందిని ఆదేశించారు. పలాస రైల్వేస్టేషన్‌లోని జీఆర్‌పీ పోలీసు స్టేషన్‌ను బుధవారం పరిశీలించారు. స్టేషన్‌ రికార్డులను పరిశీలించి జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. గంజాయి, నల్లమందు రవాణా చేసే వారిని పట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో జీఆర్‌పీ ఎస్‌ఐ ఎస్‌కే షరీఫ్‌, సిబ్బంది కోదండరావు, నవీన్‌, అనిత, తేజ, లోకనాధం పాల్గొన్నారు.

రైళ్ల ఆలస్యంతో ఇక్కట్లు

కాశీబుగ్గ : జిల్లా మీదుగా ప్రయాణిస్తున్న పలు రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగుతున్నాయి. ముఖ్యంగా విశాఖ, బరంపురం మధ్య నడిచే రైళ్లలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. బుధవారం డిబ్రుఘర్‌, అగర్తలా హమ్‌సఫర్‌, హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి–పూరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, ప్రశాంతి, బ్రహ్మపూర్‌ ఇంటర్‌సిటీ, కో ణార్క్‌, పాట్నా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లన్నీ గంట నుంచి రెండున్నర గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ఈ విషయమై రైల్వే ఉన్నతాధికారులు మాట్లాడుతూ రైల్వేట్రాక్‌ విస్తరణ, మరమ్మతుల నేపథ్యంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు