మహానాడు వేదికగా కళాకు చంద్రబాబు చెక్‌

1 Jun, 2023 01:06 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుకు పెద్ద ఝలక్కే తగిలింది. స్థానిక నియోజకవర్గంలోనే కాదు అధిష్టానం వద్ద కూడా ఆయనకు విలువ లేదని తేలిపోయింది. కళా తన మాట నెగ్గించుకోవడానికి చేసిన యత్నాలు ఫలించలేదా? కళా వెంకటరావు మాటలను అధిష్టానం పెడచెవిన పెట్టిందా? ఆయన వైఖరిని తేలికగా తీసుకుందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఎదుగుతున్న కలిశెట్టి అప్పలనాయుడును తొక్కి పెట్టాలని, పార్టీలో ఆయనకు ఎలాంటి స్థానం లేదని, నియోజకవర్గంలో అంతా తానేనని కిమిడి కళా వెంకటరావు చూపించిన దూకుడుకు అధిష్టానమే చెక్‌ పెట్టింది.

ఎచ్చెర్ల నియోజకవర్గంలో తన ప్రాబల్యానికి అడ్డు తగులుతున్నారని, చాపకింద నీరులా తనకు పోటీ గా తయారవుతున్నారని, అడుగడుగునా తన హవాను తగ్గించడమే కాకుండా టీడీపీ కేడర్‌ను తనవైపు లాక్కుంటారన్న ఉద్దేశంతో కలిశెట్టి అప్పలనాయుడుపై కిమిడి కళా వెంకటరావు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కలిశెట్టిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు. చివరికి కలిశెట్టి అప్పలనాయుడ్ని పార్టీ నుంచి సస్పెన్షన్‌ చేస్తూ జిల్లా నాయకత్వం నుంచి ప్రకటన కూడా జారీ చేయించారు. అయితే కలిశెట్టి మాత్రం వెనక్కి తగ్గలేదు. తనను సస్పెండ్‌ చేసినప్పటికీ ఆ ప్రకటన చెల్లదంటూ పార్టీ కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నా రు. నియోజకవర్గ టీడీపీలో కళాకు దీటుగా ముందుకెళ్తున్నారు.

చెప్పాలంటే కళా కంటే తన వెంటే కేడర్‌ ఉండేలా కలిశెట్టి రాజకీయాలు చేస్తున్నారు. అయితే కళా వెంకటరావు తన రాజకీయ చాతుర్యంతో కలిశెట్టి అప్పలనాయుడుకు పార్టీ కార్యక్రమాల్లో గౌర వం లేకుండా చేస్తున్నారు. పార్టీ నిర్వహించే సభలు, సమావేశాల్లో కలిశెట్టిని దూరంగా ఉంచుతున్నారు. ఇటీవల విజయనగరంలో జరిగిన పార్టీ మినీ మహా నాడులో కలిశెట్టిని వేదికపైకి రానివ్వలేదు సరికదా నోటికొచ్చినట్టు మండిపడ్డారు. పార్టీ నుంచి సస్పెండైన వ్యక్తిని ఎలా వేదికపైకి పిలుస్తారని.. ఆహ్వానం పలికిన కనకల మురళీమోహన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో పార్టీలో కళా చెప్పినదే వేదమన్నట్టుగా మినీ మహానాడు సాగింది.

ఎందు‘కళా’..
జిల్లా స్థాయిలో తన హవా చూపించిన కళా వెంకటరావు...రాజమహేంద్రవరంలో రాష్ట్ర పార్టీ నిర్వహించిన మహానాడులో చూపించలేకపోయారు. తనకు ప్రత్యర్థి, పార్టీ నాయకత్వంతో సస్పెన్షన్‌కు గురైన కలిశెట్టి అప్పలనాయుడును మాత్రం అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకున్నారు. ఒకచోట కూర్చొని కలిశెట్టితో మాట్లాడారు. హోటల్‌లో ఏర్పాటు చేసిన విందులో కలిశెట్టిని చంద్రబాబు ఏకంగా సత్కరించారు. దీంతో ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సందేహంలో పడ్డాయి. సస్పెండ్‌ చేసిన వ్యక్తిని మినీ మహానాడుకు పిలవడమేంటని కళా అడ్డుకుంటే.. అదే వ్యక్తిని ఏకంగా అధినేత చంద్రబాబు సత్కరించడం చూస్తే టీడీపీలో సస్పెన్షన్‌ ప్రకటనకు విలువ లేదా? లేదంటే కళా వెంకటరావు ప్రాబల్యాన్ని తగ్గించాలని చేసే ఎత్తుగడా? అన్న చర్చ మొదలైంది.

అక్కడ జరిగిన పరిణామాలు చూస్తుంటే కళా రాజకీయ వ్యూహాలు, అనుసరిస్తున్న వైఖరి, జారీ చేస్తున్న హకుంను చంద్రబాబు పట్టించుకోకుండా కలిశెట్టిని సత్కరించారనే అభిప్రాయాన్ని టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామంతో టీడీపీలోనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అధిష్టానం వ్యూహమేంటో తెలియడం లేదని, తాము ఎవరివైపు ఉండాలో తెలియని సందిగ్ధం నెలకొందని, చివరికీ పార్టీ ఎవరికీ పెద్ద పీట వేస్తుందో అంతు చిక్కడం లేదని, అంతవరకు తాము ఎవరి వెంట తిరగాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఎచ్చెర్ల టీడీపీ శ్రేణులు అంతర్మధనంలో పడ్డాయి.

మరిన్ని వార్తలు