ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాం: అమిత్‌ షా

19 Oct, 2020 06:14 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడుపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 చోట్ల పోటీ చేయాలన్న లక్ష్యంతో బీజేపీ పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గాల్ని గురి పెట్టి కార్యక్రమాల్ని విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఇంగ్లిషు మీడియాకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళనాట ఈ సారి పాగా వేసి తీరుతామన్న ధీమాను అమిత్‌ షా వ్యక్తం చేయడం గమనార్హం. అలాగే, రజనీ ప్రస్తావన ఈ భేటీలో రావడంతో ప్రాధాన్యత పెరిగింది. 

వ్యూహాలకు పదను..... 
తమిళనాడుపై ఈ సారి తాము ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఇక్కడి రాజకీయాలను నిశితంగానే పరిశీలించామని, ఏడు నెలల్లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, బలం పుంజుకోవడం లక్ష్యంగా విస్తృత కార్యక్రమాలు సాగుతున్నాయ ని వివరించారు. ఈసందర్భంగా ఎన్నికల్లో రజనీతో పొత్తు ఉంటుందా అని ప్రశ్నించగా, ఎన్నికలకు ఇంకా ఏడు నెలలు గడువు ఉందని, ఈ దృష్ట్యా, సమయాన్ని బట్టి నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. రజనీ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో రాలేదుగా, పార్టీ కూడా ఏర్పాటు చేయలేదుగా అని ఎదురు ప్రశ్నతో సమయం , సందర్భం కోసం వేచి ఉండాల్సిందేనని పేర్కొన్నారు.  (వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన అమిత్‌ షా)

బీజేపీలో, కూటమిలో మార్పులు ఉంటాయా అని ప్రశ్నించగా, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉంటాయన్నారు. ప్రధానంగా పార్టీలో బలోపేతం లక్ష్యంగా మార్పులు, చేర్పులు సాగుతున్నాయని, ఇది కొనసాగుతుందన్నారు. కూటమి విషయానికి వస్తే, అన్నాడీఎంకేతో కలిసి పయనం చేస్తున్నామని, ఆ పార్టీ తమకు బలమైన మిత్ర పక్షం అని,  ఇప్పటికే ఎన్నికల్ని ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. అయితే,  భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ముందే చెప్పలేమని సమాధానం ఇచ్చారు.  ఎన్నికలకు ఏడు నెలలు సమయం ఉన్న దృష్ట్యా, భవిష్యత్తు రాజకీయాల గురించి ఇప్పడే ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు