బెంగళూరు అల్లర్లు: 140 మంది అరెస్టు

14 Aug, 2020 09:46 IST|Sakshi

యువత సమయస్ఫూర్తి.. తప్పిన ప్రమాదం

సాక్షి, బెంగళూరు: బెంగళూరులో మంగళవారం అర్ధరాత్రి జరిగిన విధ్వంసకాండ సమయంలో నగర యువకులు కొందరు సమయస్ఫూర్తితో వ్యవహరించి, మతఘర్షణలకు దారి తీయకుండా కాపాడగలిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో వచ్చిన ఒక పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వర్గానికి చెందిన వారు మంగళవారం రాత్రి బెంగళూరులోని పులకేశినగర్‌ నియోజకవర్గం డీజే హళ్లి, కేజీ హళ్లి, ఆ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులకు నష్టం కలిగించిన విషయం తెలిసిందే. 

ఇదే సమయంలో ఆందోళన కారులు కొందరు షంపురా ప్రధాన రహదారి పక్కనే ఉన్న హనుమాన్‌ ఆలయం వైపునకు దూసుకు వచ్చారు. ప్రమాదం పసిగట్టిన స్థానిక యువత మతాలకతీతంగా మానవహారమై ఆలయానికి రక్షణగా నిలబడ్డారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఈ విషయమై పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ యువకుడు మాట్లాడుతూ..‘ఆలయానికి నష్టం కలిగించే ఉద్దేశంతోనే నిరసనకారులు గుంపులుగుంపులుగా వస్తున్నట్లు మాకు తెలిసింది. దీంతో మేమంతా వెళ్లి ఆలయానికి రక్షణగా నిలుచున్నాం. ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లినా ఈ వ్యవహారం చాలా తీవ్రంగా మారి ఉండేది’ అని తెలిపాడు.

అల్లర్ల వెనుక ఎస్‌డీపీఐ పాత్ర!
బెంగళూరు అల్లర్ల వెనుక సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌డీపీఐ) హస్తం ఉన్నట్లు తెలిసిందని కర్ణాటక హోం మంత్రి బస్వరాజ్‌ బొమ్మయ్‌ వెల్లడించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతామన్నారు. ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న ఎస్‌డీపీఐ జిల్లా కార్యదర్శి ముజమ్మిల్‌ అహ్మద్‌తోపాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.  విధ్వంసానికి సంబంధించి 140 మందిని అరెస్టు చేశామన్నారు.

మరిన్ని వార్తలు