అవ్వ మరణంతో అనాథలుగా..

17 Aug, 2020 14:15 IST|Sakshi

నాన్నమ్మ మృతితో దిక్కుకోల్పోయిన చిన్నారులు

జయపురం: అమ్మా, నాన్నలు పోయారు. నాన్నమ్మే వారికి అన్నీ. ప్రస్తుతం నాన్నమ్మ కూడా చనిపోవడంతో ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. కొరాపుట్‌ జిల్లా జయపురం సబ్‌డివిజన్‌ కుంధ్ర సమితి బిజాపూర్‌ పంచాయతీ ఖిలాపుట్‌ గ్రామానికి చెందిన వృద్ధురాలు పద్మ పొరజ కుమారుడు, కోడలు కొన్నేళ్ల కిందట మృతి చెందారు. అప్పటి నుంచి వారి నలుగురు కుమారులు, కుమార్తె నాన్నమ్మ పద్మ పొరజ వద్ద ఉంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.500 పింఛన్, 25 కేజీల బియ్యంతో కుటుంబం నెట్టుకువచ్చేది. కూలిపనులు చేస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. ఆ చిన్నారులకు ఏ కష్టం రాకుండా చూసుకునేది. నాన్నమ్మ మృతి చెందడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు.

వారిని ఆదుకునే ఆపద్భాందవుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఆ చిన్నారులను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వృద్ధురాలు మృతి విషయం తెలుసుకున్న బిజాపూర్‌ సర్పంచ్‌ బృందావన్‌ నాయిక్‌తో పాటు పలువురు ఆమె దహన సంస్కారాలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కుంధ్రా సమితి బీఎస్‌ఎస్‌వో సుమిత్ర ఖొర, సమితి అధ్యక్షురాలు సురేంధ్ర పొరజ, కొరాపుట్‌ జిల్లా శిశు సురక్షా అధికారి రాజేశ్వరీ దాస్‌ అక్కడకు చేరుకుని మృతురాకి కుటుంబానికి రూ.15 వేలు ఆర్థికసాయం అందజేశారు. ఆ చిన్నారులకు పునరావాసం కల్పిస్తామని జిల్లా శిశు సురక్షా అధికారి రాజేశ్వరి దాస్‌ హామీ ఇచ్చారు. అంతవరకు వారు అంగన్‌వాడీ కేంద్రంలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. 

మరిన్ని వార్తలు