‘చిన్నమ్మ’ బయటకు రాకుండా కుట్ర జరుగుతోందా!

9 Oct, 2020 11:25 IST|Sakshi

శశికళ జైలు నుంచి బయటకు రాకుండా జాప్యం

అసెంబ్లీ ఎన్నికల తర్వాత విడుదలయ్యే అవకాశం

కుట్ర జరుగుతోందని శశికళ శిబిరం ఆరోపణ

సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ జైలు నుంచి బయటకు రాకుండా జాప్యం చేయడంలో కుట్ర జరుగుతున్నట్టుగా అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు ఆరోపించే పనిలో పడ్డాయి. జప్తు నోటీసులు ఒకదాని తర్వాత మరొకటి జారీ చేస్తుండడంపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ పరప్పన అగ్రహార చెరలో ఉన్న విషయం తెలిసిందే. 2021 జనవరిలో ఆమె శిక్షాకాలం ముగియనుంది. జరిమానా రూ. 10 కోట్లు చెల్లింపు తర్వాత జైలు నుంచి చిన్నమ్మ బయటకు రావడం ఖాయమని అమ్మ శిబిరం వర్గాలు దీమా వ్యక్తం చేశాయి. ఇందుకు తగ్గ కసరత్తుల్లో  దినకరన్‌ నిమగ్నమయ్యారు. (చిన్నమ్మకు చెక్‌ పెట్టినట్టేనా..)

ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ అక్రమంగా ఆర్జించారంటూ ఆస్తుల అటాచ్, షోకాజ్‌ నోటీసులు ఒక దాని తర్వాత మరొకటి వెలువడుతుండడం అమ్మ శిబిరంలో కలవరాన్ని రేపింది. ఇప్పటికే ఐటీ రెండు విడతలుగా ఆస్తుల్ని జప్తు చేసింది, మూడో విడతగా రూ. రెండువేల కోట్ల ఆస్తులను బుధవారం అటాచ్‌ చేసింది.  నోటీసులను సిరుదావూర్‌ బంగ్లా, కొడనాడు ఎస్టేట్‌లలో ఐటీ వర్గాలు గురువారం అంటించి వెళ్లాయి. అమ్మ వారసులుగా దీప, దీపక్‌లను కోర్టు ప్రకటించిన దృష్ట్యా,  వారికి కూడా షోకాజ్‌ నోటీసులు పంపడం గమనార్హం.

ఇప్పటివరకు రూ. 3,900 కోట్ల విలువగల ఆస్తులను ఐటీ జప్తు చేసింది. చిన్నమ్మ విడుదలను అడ్డుకోవడం లక్ష్యంగా కుట్ర జరుగుతోందని అమ్మ శిబిరం ఆరోపిస్తోంది. ఎన్నికల అనంతరం వచ్చేలా కుట్ర సాగుతోందని, అందుకే ఆస్తుల అటాచ్‌లు, జప్తులు, షోకాజ్‌ నోటీసులు సాగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుట్రల్ని చిన్నమ్మ భగ్నం చేస్తారని పేర్కొన్నా, తాజా పరిణామాలు అమ్మ శిబిరాన్ని కలవరంలో పడేసి ఉండడం గమనార్హం.  (చిన్నమ్మకు షాక్‌ : రూ 2000 కోట్ల ఆస్తుల ఫ్రీజ్)

మరిన్ని వార్తలు