10 కోట్ల చెల్లింపునకు సిద్ధంగా ఉండండి: చిన్నమ్మ లేఖ

20 Oct, 2020 08:10 IST|Sakshi

న్యాయవాదికి చిన్నమ్మ లేఖ

కరోనా ప్రభావంపై ఆందోళన 

సాక్షి, చెన్నై : చట్ట ప్రకారం కర్ణాటక జైళ్ల శాఖ మంచి నిర్ణయం తీసుకుంటుందని, జరిమానా చెల్లింపునకు సిద్ధంగా ఉండాలని న్యాయవాది రాజాచెందూర్‌ పాండియన్‌కు చిన్నమ్మ శశికళ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. శిక్షాకాలం 2021 జనవరిలో ముగియనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆమెతో ములాఖత్‌ అయ్యేందుకు సన్నిహితులు, న్యాయవాదులకు కర్ణాటక అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో శశికళ తన న్యాయవాదికి రాసిన లేఖ సోమవారం వెలుగులోకి వచ్చింది.   (సీఎంని పరామర్శించిన ఎంకే స్టాలిన్‌)

లేఖలో ఏముందంటే..
భగవంతుడి దయతో తాను బాగానే ఉన్నానని చిన్నమ్మ పేర్కొన్నారు. తమిళనాడును కరోనా వణికిస్తోందని, దాని ప్రభావం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రం కరోనా నుంచి పూర్తిగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు వివరించారు. మార్చి నుంచి తనతో ములాఖత్‌లను కర్ణాటక జైళ్ల శాఖ నిలుపుదల చేసిందని, ఎప్పుడు పునరుద్ధరిస్తుందదో తెలియదన్నారు. తన విడుదల విషయాన్ని ప్రస్తావిస్తూ జైళ్ల శాఖ త్వరలో చట్ట ప్రకారం మంచి నిర్ణయం తీసుకుంటుందని, మంచే జరుగుతుందని భావిస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. 10 కోట్ల రూపాయల జరిమానా చెల్లింపునకు సిద్ధంగా ఉండాలని, అలాగే కోర్టులో పిటిషన్‌ దాఖలు, ఇతర న్యాయపరమైన వ్యవహారాలపై ఢిల్లీలోని సీనియర్‌ న్యాయవాదుల్ని సంప్రదించాలని ఆదేశించారు. దినకరన్‌(అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత)తో కలిసి ముందుకు సాగాలని కోరారు.    

మరిన్ని వార్తలు