ఎమ్మెల్యే ప్రేమ వివాహం.. నేడు కోర్టు ముందుకు

9 Oct, 2020 10:41 IST|Sakshi

సాక్షి, చెన్నై: భార్యను కోర్టులో హాజరు పరిచేందుకు కళ్లకురిచ్చి ఎమ్మెల్యే ఆర్‌ ప్రభు అంగీకరించారు. కోర్టు ఆదేశాల్ని శిరసావహిస్తానని ప్రకటించారు. కళ్లకురిచ్చి(రి) ఎమ్మెల్యే ప్రభు త్యాగదుర్గం మలయమ్మన్‌ ఆలయ అర్చకుడు స్వామినాథన్‌ కుమార్తె సౌందర్యను సోమవారం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వివాహం బెదిరింపుల మధ్య జరిగినట్టు, తన కుమార్తెను కిడ్నాప్‌ చేసినట్టు సౌందర్య తండ్రి స్వామినాథన్‌ ఆరోపించడమే కాదు, కోర్టు తలుపుతట్టారు.

దీంతో తామిద్దరం ఇష్టపడే వివాహం చేసుకున్నామని, ఇందులో ఎలాంటి బెదిరింపులు, కిడ్నాప్‌లు లేవు అని సౌందర్య ప్రకటించింది. అయినా, పట్టువదలకుండా తన కుమార్తెను బలవంతంగా వివాహం చేసుకున్నారని, రక్షించాలని కోరుతూ స్వామినాథన్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది.  పిటిషనర్‌ వాదనను విన్న కోర్టు, సౌందర్యను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు.  (వివాదంగా మారిన ఎమ్మెల్యే ప్రేమ వివాహం)

కోర్టు ఆదేశాలపై ఎమ్మెల్యే ప్రభు స్పందించారు. భార్యను కోర్టులో హాజరు పరిచేందుకు సిద్ధమేనని, శుక్రవారం కోర్టుకు వెళ్తున్నట్టు తెలిపారు. తన మామతో మాట్లాడేందుకు ప్రయతి్నస్తున్నా, ఆయన పట్టువదలడం లేదని, తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని, దీనిని ఆయన రాద్ధాంతం చేయడం విచారకరంగా పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల్ని శిరసావహిస్తానని, భార్యను కోర్టులో హాజరు పరుస్తానని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు