పెద్దక్షరాలతో ప్రిస్క్రిప్షన్‌

14 Aug, 2020 13:09 IST|Sakshi

చక్కని దస్తూరితో వైద్య సలహాలు, నివేదికలు 

వైద్యులకు హై కోర్టు సూచన 

భువనేశ్వర్‌: మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌ను రోగులకు అర్థమయ్యేలా క్యాపిటల్‌ అక్షరాల్లో రాయాలని హైకోర్టు వైద్య వర్గానికి సూచించింది. అర్థం కాని చేతి రాతతో ఉన్న వైద్య సలహాలు, ఆరోగ్య నివేదికలను తప్పుగా అర్థం చేసుకుంటే అనర్థాలు జరుగుతాయని అభిప్రాయపడింది. వైద్యుల నివేదికతో ముడిపడిన విచారణ, దర్యాప్తు వంటి సందర్భాల్లో పోలీసులు, ప్రాసిక్యూటర్లు, న్యాయమూర్తులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఫలితంగా విచారణ ప్రక్రియ మందగిస్తుందని హైకోర్టు పేర్కొంది.

బెయిలు దరఖాస్తు విచారణను సందర్భంగా రాష్ట్ర హై కోర్టుకు ఈ వ్యాఖ్యలు చేసింది. వైద్యులు ఇకమీదట అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కని దస్తూరితో సలహాలు, నివేదికలు, పరిశీలనల్ని జారీ చేయాలని ఆదేశించింది. వైద్య వర్గాన్ని తక్షణమే చైతన్య పరచి కార్యాచరణ వాస్తవంగా అమలు చేయాలని సూచించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చొరవ తీసుకోవాలని కోర్టు అభ్యర్థించింది. అనారోగ్యంతో మంచాన పడిన భార్యకు తోడుగా ఉండడం అనివార్యంగా గుర్తించి బెయిలు మంజూరు చేయాలని కోరుతూ అందిన దరఖాస్తుతో పాటు దానికి అనుబంధంగా జతచేసిన వైద్య నివేదికలను పరిశీలించిన కోర్టు ఆ నివేదికల సారాంశం అర్థంకాక ఇబ్బంది పడింది. 

వైద్య మండలి సలహా.. 
సాధారణ ప్రజలకు అర్థమయ్యేట్లు మందుల చీటి వగైరా విషయాల్ని చక్కని దస్తూరి లేదాక్యాపిటల్‌ అక్షరాల్లో రాయాలని భారత వైద్య మండలి ఎంసీఐ 2016 సంవత్సరంలో ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని హై కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. వైద్యులు జారీ చేసే సలహాలు (ప్రిస్క్రిప్షన్‌), వోపీడీ చీటీలు, పోస్టుమార్టం నివేదిక, గాయాల నివేదిక ఇతరేతర న్యాయ విచారణ సంబంధిత వైద్య నివేదికల్ని ఇక నుంచి క్యాపిటల్‌ అక్షరాలు లేదా చక్కని దస్తూరితో జారీ చేయాలని జస్టిస్‌ ఎస్‌.కె.పాణిగ్రాహి ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా కోవిడ్‌– 19 మహమ్మారి పోరులో వైద్యుల సేవల్ని ఈ ధర్మాసనం అభినందించింది.   

మరిన్ని వార్తలు