అమ్మ స్మారకం జాప్యం.. సీఎం అసంతృప్తి 

11 Aug, 2020 08:07 IST|Sakshi

సాక్షి, చెన్నై: మెరీనా తీరంలో చేపట్టిన దివంగత సీఎం జయలలిత స్మారక మందిరం నిర్మాణ పనుల్లో జాప్యం జరగడంపై సీఎం పళనిస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబరులోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెన్నై మెరీనా తీరంలో ఎంజియార్‌ సమాధికి కూతవేటు దూరంలో అమ్మ జయలలిత సమాధి ఉంది. ఇక్కడికి ప్రతి రోజూ సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మ సమాధిని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాంతాన్ని అత్యాధునిక హంగులతో స్మారక మందిరంగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయించారు. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతోపాటు కోస్టల్‌ అనుమతులు అంటూ వివాదం రేగింది. దీంతో పనులకు ఆటంకాలు తప్పలేదు. రాష్ట్రంలో ఉన్నది తమ ప్రభుత్వమే కావడంతో పనుల్ని ముందుకు తీసుకెళ్లేందుకు అన్నాడీఎంకే నాయకులు సిద్ధం అయ్యారు. ఆ మేరకు 2018 మేలో పనులకు శ్రీకారం చుట్టారు. 2019 ఫిబ్రవరిలో జయలలిత తొలి జయంతి సందర్భంగా దీనిని ప్రారంభించాలని తొలుత సంకల్పించినా, ఆటంకాల రూపంలో పనుల్లో జాప్యం తప్పడం లేదు. (రాజుకుంటున్న ఎన్నికల వేడి)

సెప్టెంబరు వరకు గడువు.... 
గత ఏడాది చివర్లో ముగించి, ఈ ఏడాది రెండో జయంతి సందర్భంగా ప్రారంభిద్దామనుకున్నా ఆటంకాలు తప్పలేదు. సమాధి పరిసరాలను సుందరంగా, అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దడం, జయలలిత జీవితం, సినిమా, రాజకీయ ఘనతను చాటేలా ఫొటో, వీడియో ప్రదర్శనను ఆ స్మారక మందిరంలో ఏర్పాటు చేస్తూ నిర్మాణాలు చేపట్టారు. ఆ పరిసరాల్ని ముస్తాబు చేసి నిర్మాణాలకు మెరుగులు దిద్దాల్సి ఉంది. ఫినిక్స్‌ పక్షి ఆకారంతో సమాధి స్మారకం నిర్మాణంతో అస్సలు సమస్య నెలకొని ఉంది. 15 మీటర్ల ఎత్తుతో, రెండు వైపులా ఆ పక్షి రెక్కలు 21 మీటర్ల ఉండేలా నిర్మాణం సాగుతోంది. ఐఐటీ మద్రాసు, అన్నా వర్సిటీ సాంకేతిక విభాగం సహకారంతో దుబాయ్‌ నుంచి తీసుకొచ్చిన పరికరాలతో ఈ ఫినిక్స్‌ పక్షి నిర్మాణాన్ని రూపొందిస్తున్నారు. పలు కారణాల వల్ల ఆగస్టు మొదటి వారానికి దీన్ని ప్రభుత్వానికి అప్పగించలేని పరిస్థితి.

సెప్టెంబరు చివరి వరకు గడువు ఇవ్వాలని అధికారులు సీఎం పళనిస్వామి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా జాప్యం, కరోనా తదితర సమస్యల వల్ల నిర్మాణ పనుల వ్యయం మరో పది కోట్లకు పెరిగినట్టు సమాచారం. వీటిని పరిశీలించిన సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. సెప్టెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబరులో జయలలిత వర్ధంతి సందర్భంగా ఈ స్మారకం ప్రారంభం లక్ష్యంగా ప్రభుత్వం ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆగమేఘాల మీద పనులు సాగించేందుకు ప్రజా పనుల శాఖ వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు రానున్న నేపథ్యంలో అమ్మ స్మారకం అన్నాడీఎంకే వర్గాలకే కాకుండా ప్రజలందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్న కాంక్షతో సీఎం ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే పోయెస్‌ గార్డెన్‌ వేదా నిలయంకు కొత్త మెరుగులకు తగ్గ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు