నా సమాచారం ఎవ్వరికీ ఇవ్వొద్దు: శశికళ

25 Sep, 2020 06:28 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

చిన్నమ్మ లేఖాస్త్రం 

సాక్షి, చెన్నై : తన గురించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని కర్ణాటక జైళ్ల శాఖకు చిన్నమ్మ శశికళ లేఖాస్త్రం సంధించిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు పర్పప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసి జనవరిలో ఆమె విడుదల కానున్నట్టు సమాచారం హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. శిక్షా కాలం ముగిసిన అనంతరం చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం దాదాపు ఖాయమైంది. జరిమానా రూ.10 కోట్లు ముందుగా చెల్లించాల్సి ఉంది. అందుకే ఆమె ప్రతినిధి, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ బెంగళూరులో తిష్ట వేశారు.

తన వివరాలను ఎవరుపడితే వారు సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటుండడంతో చిన్నమ్మ ఆగ్రహం చెందినట్టు సమాచారం. తన వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని జైళ్ల శాఖకు ఆమె లేఖ రాశారు. విడుదల వ్యవహారం గురించి సమాచారం సేకరించిన వారు, మున్ముందు తన విడుదలకు అడ్డు తగిలేలా కొత్త వివరాల కోసం సమాచార చట్టాన్ని అడ్డం పెట్టుకోవచ్చని భావించి చిన్నమ్మ లేఖ రాసినట్టు అమ్మ శిబిరంలో చర్చ జరుగుతోంది. జైలులో లగ్జరీగా ఉన్నారన్న విషయం ఒకటి ప్రచారం అవుతున్న దృష్ట్యా దీన్ని బూతద్దంలో పెట్టే దిశగా సమాచారం సేకరించే వారు ఉండవచ్చనే ఆమె భావించినట్టు తెలిసింది.   (అమ్మ శిబిరంలో కమలం పంచాయితీ!)

చిన్నమ్మ సోదరుడికి  వారెంట్‌ 
చిన్నమ్మ కుటుంబ సభ్యులు, బంధువుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అలాగే కేసులు విచారణలో ఉన్నాయి. ఈ క్రమంలో చిన్నమ్మ సోదరుడు సుందరవదనన్‌కు తంజావూరు కోర్టు పీటీ వారెంట్‌ జారీ చేసింది. గతంలో తన ఆస్తులను కబ్జా చేశారని తంజావూరుకు చెందిన మనోహరన్‌ సతీమణి వలర్మతి ఫిర్యాదు చేశారు. దీంతో సుందర వదనన్, చిన్నమ్మ బంధువులు 10 మందిపై కేసులు నమోదయ్యాయి. కోర్టు విచారణకు వీరు డుమ్మా కొడుతున్నారు. అంతేగాక ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. వీరిని పట్టుకుని కోర్టులో హాజరుపరచాలని తంజావూరు కోర్టు పీటీ వారెంట్‌ను జారీ చేసింది.    

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు