సోషల్‌ డిస్టెన్స్‌ అంటే ఇలా కాదురా అబ్బాయిలు!

2 May, 2021 12:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆనంద్ మ‌హీంద్ర.. పరిచయం అక్కర్లేని పేరు. దేశీ ఆటోమొబైల్‌ రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న వ్యాపార దిగ్గజం. ఆయన ఇతర వ్యాపార ప్రముఖుల కంటే భిన్నంగా ఆలోచిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకు తగ్గట్లు సమయం, సందర్భాన్ని బట్టి నెటిజన్లతో తన అభిప్రాయాల్ని పంచుకుంటుంటారు. అభిప్రాయల్ని పంచుకోవడమే కాదు ఆపన్న హస్తం అందించేందుకు ఎప్పుడూ ముందుంటారు.

అయితే దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు కరోనా నిబంధల్ని పాటించాలని ప్రచారం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో శానిటైజర్లను వినియోగించడం, మాస్క్‌లు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని సూచిస‍్తున్నారు. తాజాగా కరోనా పరిస్థితులకు ఆపాదిస్తూ 2017 నాటి ఓ ఫోటోను ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేశారు. ఆ ఫోటోలో ఇద్దరు ద్విచక్ర వాహన దారులు నిచ్చెన రెండు చివర్లలో తలల్ని దూర్చి దాన్ని తరలిస్తున్నారు. ఆఫోటోను నెటిజన్లతో పంచుకున్న ఆనంద్‌ మహీంద్ర .. 'ఈ ఫోటో నవ్వుతెప్పిస్తుంది. సామాజిక దూరం అంటే ఇలా ప్రమాదకరమైన స్టంట్‌లు కాదు. ఇలాంటి అనుకోని ప్రమాదాల్ని తెచ్చి పెడుతుంటాయి జాగ్రత్త’ అంటూ పోస్ట్‌ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

కాగా, దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నా సంగతి తెలిసిందే. సిలిండర్ల కొరతను అధిగమించేందుకు ఆనంద్‌ మహింద్రా తన వంతుగా పలు సేవా కార్యక్రమాల్ని ప్రారంభించారు. 'ఆక్సిజన్‌ వీల్స్‌'  పేరుతో ప్రధాన నగరాలకు చెందిన 13 ఆస్పత్రులకు 61 జంబో సిలిండర్లను మహీంద్రా వాహనాల్లో తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు ఆనంద్‌ మహీంద్ర ఇటీవల తెలిపారు.

  

Read latest Summer-special News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు