నాలుగు రోజులు ఇంట్లోనే మృతదేహం

11 Mar, 2023 09:36 IST|Sakshi
శ్రీను (ఫైల్‌)

కేతేపల్లి : కుటుంబ తగాదాలతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహానికి నాలుగు రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. ఈసంఘటన కేతేపల్లి మండలంలోని తుంగతుర్తిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని తుంగతుర్తి గ్రామానికి చెందిన గునగంటి శ్రీను(37) మాడ్గులపల్లి మండలం పాములపహాడ్‌లో రైస్‌ మిల్లును కొనుగోలు చేసి కుటుంబంతో సహా ఏడేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఆస్తి పంపకాల విషయంలో కుటుంబ సభ్యులతో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 6న పాములపాడుకు వెళ్లిన తల్లిదండ్రులు, సోదరుడు శ్రీనుతో గొడవపడ్డారు. ఈక్రమంలో శ్రీనుపై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీను అదే రోజు సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఈనెల 6న రాత్రి శ్రీను మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు వచ్చారు. అయితే శ్రీను మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించటంతో పాటు, ఆస్తిని తన పిల్లల పేరిట రిజిస్టర్‌ చేయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ శ్రీను భార్య తరుపు బంధువులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేది లేదని అడ్డుకున్నారు. శ్రీను మృతికి కారణమైన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నందున ఆస్తులు ప్రస్తుతం పిల్లల పేర రాయించేందుకు వీలు కాదని, అంత్యక్రియల నిర్వహించిన అనంతరం మాట్లాడుదామని చెప్పినా అంగీకరించ లేదు. చివరకు కుల పెద్దలు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో అంత్యక్రియలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు