పప్పులకు మద్దతు

15 Sep, 2023 06:12 IST|Sakshi
పెసళ్లకు రూ.803, కందులకు రూ.400 పెంపు

సూర్యాపేట : వానాకాలం పంటలు సాగు చేసిన రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 14 రకాల పంటల మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా నువ్వులకు క్వింటాకు రూ.805, పెసళ్లకు రూ.803 చొప్పున పెంచింది. వరి క్వింటాకు రూ.143 ప్రకటించింది. రోజురోజుకూ తగ్గుతున్న పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో వాటి మద్దతు ధరను భారీగా పెంచింది. 2023–24 సంవత్సరానికి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే పంటలకు ఈ మద్దతు ధర కల్పించనుంది.

అత్యధికంగా వరి రైతులే..

జిల్లాలో ఈ వానాకాలం 6.32 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ సీజన్‌లో మిర్చి మినహా ఇతర అన్ని పంటల సాగు పూర్తయింది. ఇందులో సుమారు 4.41 లక్షల ఎకరాల్లో వరి సాగు అయినట్లు సమాచారం. రెండో స్థానంలో పత్తి పంట ఉండనుంది. ఇక పప్పు ధాన్యాల సాగు అంతంత మాత్రంగానే ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పంటల సాగు సర్వే కొనసాగుతోంది. రెండు మూడు రోజుల్లో ఈ సర్వే పూర్తి కానుంది. ఈ లెక్కల ప్రకారం కేంద్రం పెంచిన మద్దతు ధరను జిల్లాలో వరి సాగు చేసిన రైతులే ఎక్కువగా పొందే అవకాశముంది. వరి సాధారణ రకానికి రూ.2183, ఏ గ్రేడ్‌ రకానికి రూ.2203 చెల్లించి ఈ వానాకాలం గ్రామాల్లో ఏర్పాటు చేసే ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.

పప్పు ధాన్యాల సాగు పెంచడానికి..

ఏటేటా పడిపోతున్న పప్పుదినుసులు, నూనెగింజల సాగును ప్రోత్సహించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏటా ఈ పంటల ధరను అధికంగా పెంచుతూ వస్తోంది. ఈ వానాకాలంలోనూ నువ్వుల ధరను క్వింటాకు రూ.805 పెంచగా గతంలో ఉన్న మద్దతు ధర రూ.7830 నుంచి రూ.8635కి చేరింది. ఇక క్వింటా పెసళ్లకు రూ.803 పెంచడంతో గతంలో ఉన్న మద్దతు ధర రూ.7755 కాస్త రూ.8558కి చేరింది. కందులకు గతంలో రూ.6600ల మద్దతు ఉండగా రూ.400 పెంచింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రూ.7వేలకు క్వింటా కందులను కొనుగోలు చేయనున్నారు. వేరుశనగకు క్వింటాకు రూ.527లు, పొద్దుతిరుగుడు రూ.360ల చొప్పున పెంచింది. ఇక జిల్లాలో రెండోస్థానంలో సాగయ్యే పత్తి మధ్యస్త రకం రూ.540 పెంచగా రూ.6630లకు, పొడవు గింజ ధరను రూ.640లు పెంచగా రూ.7020లకు మద్దతు ధర పెరిగింది.

వివిధ పంటల ధర పెంపు (క్వింటాకు రూ.లలో)

పంటరకం పెంపు మద్దతు ధర

వరి (సాధారణం) 143 2183

వరి (ఏ గ్రేడ్‌) 143 2203

జొన్న 210 3180

సజ్జలు 150 2500

రాగులు 268 3846

మొక్కజొన్న 128 2090

కందులు 400 7000

పెసర 803 8558

మినుములు 350 6950

వేరుశనగ 527 6377

పొద్దుతిరుగుడు 360 6760

సోయాబీన్‌ 300 4600

నువ్వులు 805 8635

పత్తి (మధ్యరకం) 540 6620

పత్తి (పొడవు) 640 7020

నైగర్‌ విత్తనాలు 447 7734

ఫ వానాకాలం 14 రకాల పంటల మద్దతు ధర పెంపు

ఫ అత్యధికంగా నువ్వులు, పెసళ్లకు..

ఫ వరి క్వింటాకు రూ.2203..

ఫ కేంద్రం నిర్ణయంపై కర్షకుల హర్షం

మరిన్ని వార్తలు