కలసికట్టుగా పనిచేస్తేనే ఎన్నికల నిర్వహణ సాధ్యం.. కలెక్టర్‌..

12 Oct, 2023 11:27 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావు, చిత్రంలో అదనపు కలెక్టర్‌ తదితరులు

అక్రమ మద్యం, నల్లబెల్లం, నాటుసారా, నగదుపై గట్టి నిఘా ఉంచండి

చెక్‌ పోస్ట్‌ల్లో నిఘా పెంచి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి

రూ.50 లక్షలకు పైబడి పట్టుబడితే డబ్బు,వాహనం రెండూ కూడ సీజ్‌ 

లావాదేవీలపై నిరంతర పరిశీలన చేయాలని బ్యాంక్ అధికారులకు ఆదేశం 

ఎన్నికల నిర్వాహణ సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు

సూర్యాపేట: జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన టీములు నిబద్ధతతో పనిచేస్తూ రోజు వారీ నివేదికలను అందించాలని కలెక్టర్‌ యస్‌. వెంకట్రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇంటలీజెన్స్‌ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో అక్రమ మద్యం, నల్లబెల్లం, నాటుసారా, నగదుపై గట్టి నిఘా ఉంచి తనిఖీలు చేపట్టాలన్నారు.

పట్టుకున్న నగదు ను సత్వరమే అకౌంట్‌లో జమ చేయాలని ఆదేశించారు. రూ. 5 లక్షల విత్‌డ్రాలను నిరంతరం పరిశీలించి నివేదికలు అందించాలన్నారు. చెక్‌ పోస్ట్‌ల్లో నిఘా పెంచి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, నగదు దొరికితే గ్రీన్‌ కమిటీకి అన్ని ఆధారాలతో సమర్పించాలని, రూ. 50 లక్షలకు పైబడి పట్టుబడితే వెంటనే డబ్బులతో పాటు వాహనాన్ని సీజ్‌ చేయాలని సూచించారు. లావాదేవీలు నిరంతర పరిశీలన చేయాలని బ్యాంక్‌ అధికారులను ఆదేశించారు.

రోజూ వాణిజ్య పరమైన లావాదేవీలపై నిరంతరం నిఘా ఉంచాలని , గృహోపకరణ గోదాంలను తని ఖీలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనవు కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక, అదనవు ఎస్పీ నాగేశ్వర రావు, ఏజీయం జ్యోతి, ఎకై ్సజ్‌ పర్యవేక్షకురాలు అనిత, ఎల్‌డీయం బాపూజీ, డీటీఓ రవి కుమార్‌, డీసీఓ శ్రీధర్‌, సీటీఓ యాదగిరి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల పరిశీలనకు టీములు
పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతుల పరిశీలనకు నియోజకవర్గానికి ఒక టీము చొప్పున ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ యస్‌. వెంకట్రావు ఓ ప్రకటనలో వెల్లడించారు. సూర్యాపేట నియోజక వర్గానికి జెడ్పీ సీఈఓ సురేష్‌, కోదాడకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావునాయక్‌, హుజూర్‌నగర్‌కు డీపీఓ యాదయ్య, తుంగతుర్తి నియోజకవర్గానికి డీఆర్‌డీఓ కిరణ్‌కుమార్‌ను నియమించామని వీరి ఆధ్వర్యంలో టీములు పనిచేస్తాయని తెలిపారు. ఈ టీముల్లో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌, మిషన్‌ భగీరథ, విద్యుత్‌ శాఖ అధికారులు ఉంటారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు