ఎన్నాళ్లకెన్నాళ్లకు..! సినీ నటి కుష్భుకు కేంద్రం కీలక పదవి

28 Feb, 2023 22:18 IST|Sakshi
కుష్భు

సాక్షి, చైన్నె: సినీ నటి, బీజేపీ మహిళా నేత కుష్భు సుందర్‌కు కేంద్రం ఎట్టకేలకు తగిన గుర్తింపునిచ్చింది. ఆమెను జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై మహిళల హక్కుల పరిరక్షణ, బాధితులకు న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా శ్రమిస్తానని ఈసందర్భంగా కుష్భు తెలిపారు. వివరాలు.. సినీ నటిగా తమిళ అభిమానుల గుండెల్లో కుష్భుకు ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు వారు గుడిని సైతం నిర్మించారు. ఇక డీఎంకేతో రాజకీయాల్లోకి ఆమె అడుగు పెట్టినా, అక్కడ ఇమడ లేక పోయారు. తర్వాత కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నా న్యాయం దక్కేలేదు. చివరకు బీజేపీలో చేరారు. దీంతో ఆమెకు 2021 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. అయితే చేపాక్కం – ట్రిప్లికేన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు దక్కలేదు. పొరుగున ఉన్న థౌజండ్‌ లైట్స్‌లో అయిష్టంగానే బరిలోకి దిగినా నిరాశే మిగిలింది. ఆ తదుపరి పరిణామాలతో ఓ వైపు సినీమాలు, టీవీ షోలు, మరో వైపు రాజకీయాలు అంటూ బిజీగానే ఉంటూ వచ్చారు. ఆమెకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కినా, కేంద్ర ప్రభుత్వం రూపంలో ఒక్క నామినేటెడ్‌ పదవీ వరించ లేదు. ఆమెకు ఏదైనా కీలక పదవిని అప్పగిస్తారనే ఆశతో అభిమానులు ఎదురు చూశారు. ఎట్టకేలకు కేంద్రం పెద్దలు కుష్భు సేవలను గుర్తించారు. ఆమెకు జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు పదవిని అప్పగించారు.

లేఖ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందిస్తా..

తనకు జాతీయ పదవి దక్కడంతో కుష్భు ఆనందం వ్యక్తం చేశారు. ఓ మీడియాతో ఆమె మాట్లాడుతూ, తమిళనాడులో మహిళ గళం, స్వరం వినిపించడమే కాదు, హక్కుల పరిరక్షణ, బాధితులకు న్యాయం కల్పించేందుకు ఇక తాను ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. ఇక ధైర్యంగా బాధితులు ముందుకు రావవచ్చని, తనకు కనీసం లేఖ ద్వారా అయినా సమాచారం ఇవ్వొచ్చని సూచించారు. పార్టీలకు అతీతంగా తన సేవలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ పదవి పార్టీతో సంబంధం లేదని, దేశానికి సంబంధించిన పదవి అని వ్యాఖ్యానించారు. మహిళా కమిషన్‌ సభ్యురాలిగా తన బాధ్యతలను, కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తానని, తమిళనాడు మహిళల పక్షాన నిలబడుతానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుష్భుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో పాటుగా ఆ పార్టీ వర్గాలు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

సినీ నటి కుష్భుకు కీలక పదవి

జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా నియామకం

పార్టీలకు అతీతంగా సేవలు అందిస్తానని వెల్లడి

మరిన్ని వార్తలు