వర్షంతో పులకింత

18 Mar, 2023 01:26 IST|Sakshi
చైన్నెలో కురుస్తున్న వర్షం

మరో మూడు రోజులు వానలు

సాక్షి, చైన్నె: చైన్నె శివారు జిల్లాలు శుక్రవారం వర్షంతో పులకించాయి. మరో మూడు రోజులు 13 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా ఉదయం వేళలో చలి, ఆ తర్వాత ఎండ అన్నట్టు పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వాతావరణ మార్పుతో జ్వరాల బారినపడ్డ వారు కూడా ఎక్కువే. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అయితే, శుక్రవారం వాతావరణం పూర్తిగా మారింది. చైన్నె నగరం, శివారు జిల్లాల్లో అనేక చోట్ల మోస్తరు వర్షం పడింది. ఉపరితల ఆవర్తనం, గాలి ప్రభావంతో ఈ వర్షం పడ్డట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో రెండు మూడు రోజులు ఈ వర్షాలు కొనసాగుతాయని వివరించారు. భిన్నమైన వాతావరణంతో తల్లడిల్లుతూ వచ్చిన చైన్నె వాసులకు శుక్రవారం ఆహ్లాదకర వాతావరణం ఎదురైంది. చల్లటి గాలితో కొన్ని చోట్ల మోస్తరుగా, మరికొన్ని చోట్ల వడగండ్ల వర్షం, ఇంకొన్ని చోట్ల భారీ వర్షం పులకింతకు గురిచేసింది. ఎగ్మూర్‌, విరుగంబాక్కం, శాలిగ్రామం, వడపళణి, కోడంబాక్క, తేనాంపేట, కొళత్తూరు, వాషర్‌మన్‌పేట పరిసరాల్లో మోస్తరు వర్షం పడింది. వేళచ్చేరి పరిసరాలలో భారీ వర్షంకురిసింది. చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల పరిధిలో అనేక చోట్ల వర్షం పడింది. మదురై విరుదునగర్‌, పుదుకోట్టై, శివగంగై, రామనాథపురం, తిరుచ్చి, తూత్తుకుడిలోనూ వర్షం పడింది. 13జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతవరణ కేంద్రం పేర్కొంది.

మరిన్ని వార్తలు