'రజనీకాంత్‌ ఉత్తమ నటుడా?' అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు

19 Mar, 2023 01:32 IST|Sakshi

తమిళ సినిమా: టాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఘన విజయాన్ని సాధించడంతోపాటు ప్రపంచ ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డును సాధించి భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టింది. ఆ చిత్రంలోని నాటునాటు పాట ఈ అవార్డును గెలుచుకున్నట్లు తెలిసింది. దీంతో భారతీయ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా గర్వపడుతోంది. అయితే ఈ అవార్డు విషయంలో కొన్ని విమర్శలు ఎదురవుతున్నాయి. ఎవరి అభిప్రాయాలు వారివి కాబట్టి అది సహజమే. కాగా తమిళ దర్శకుడు, నటుడు అమీర్‌ ఆస్కార్‌ అవార్డుల విషయంలో తనదైన శైలిలో స్పందించారు. ఇంకా చెప్పాలంటే ఆస్కార్‌ అవార్డునే విమర్శించారు. ఈయన శుక్రవారం సాయంత్రం ఒక సినిమా వేడుకలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటునాటు పాట ఆస్కార్‌ అవార్డు గెలుచుకోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన అమీర్‌ ఒక భారతీయ సినిమా ఆస్కార్‌ అవార్డును గెలుచుకోవడం సంతోషం అన్నారు.

అయితే ఆస్కార్‌ అవార్డు అనేది ఆ దేశంలో అందించే జాతీయ అవార్డు అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ఉత్తమ నటుడు అయిన శివాజీ గణేషన్‌కు చివరి వరకు ఎందుకు జాతీయ అవార్డు రాలేదన్నారు. దేవర్‌ మగన్‌ చిత్రంలోని ఆయన నటనకు గాను ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారని, అయితే దానిపై స్పందించిన శివాజీ గణేషన్‌ ఈ అవార్డు వచ్చింది కాదని, ఆ జ్యూరీ సభ్యులను మనవారు పట్టుబట్టి ఇప్పించిన అవార్డు అని పేర్కొన్నారన్నారు. పక్షపాతంలేని ఉత్తమ నటుల అవార్డుల ప్రదానం 30 ఏళ్ల క్రితమే ముగిసిందన్నారు. ఇప్పుడు అందిస్తున్న అవార్డులన్నీ లాబీయింగే కారణం అనే విమర్శలు ఉన్నాయన్నారు. 2007లో శంకర్‌ దర్శకత్వంలో రజినీకాంత్‌ నటించిన శివాజీ చిత్రంలోని నటనకు గాను ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడు అవార్డు ప్రదానం చేసిందన్నారు. అలాగని రజనీకాంత్‌ ఉత్తమ నటుడు అని చెప్పగలమా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక ఎంటర్‌ టెయినర్‌ మాత్రమేనని పేర్కొన్నారు. నిజానికి రజనీకాంత్‌ ఉత్తమ నటన గురించి చెప్పాలంటే ముల్లుమ్‌ మలరుమ్‌, ఆరిలిరుందు అరుబదు వరై వంటి చిత్రాలని చెప్పాలన్నారు. ఆ చిత్రాలకు ఎందుకు అవార్డును ఇవ్వలేదని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు