సాక్షి, చైన్నె: రాష్ట్ర ఆర్థిక సలహా కమిటీతో సీఎం ఎంకే స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన క్యాంప్ కార్యాలయం నుంచి శనివారం సమావేశమయ్యారు. ఇందులో అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న 2023–24 సంవత్సర సాధారణ బడ్జెట్‌పై చర్చించారు. అలాగే, కొత్త పథకాలు, కొత్త ప్రాజెక్టులు, వాటికి అయ్యే ఖర్చులు, నిధుల సమీకరణ గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ, తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక శాఖతో సహా వివిధ శాఖలకు నిరంతరం సలహాలు ఇస్తూ ఉండాలని కమిటీ సభ్యులకు సూచించారు. బడ్జెట్‌లోని అంశాలు, కొత్త ప్రాజెక్టుల గురించి ఆర్థిక వ్యవహారాలపై సూచనలు ఇవ్వాలని కోరారు. కమిటీ ఇచ్చే సలహాలు, సూచనలకు అనుగుణంగా ఆర్థిక భారం పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి పళణి వేల్ త్యాగరాజన్, ప్రొఫెసర్ రఘురామ్ రాజన్, డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్, ప్రొఫెషర్ జాన్ థ్రేస్, డాక్టర్ ఎస్. నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.