‘హెలికాప్టర్‌ సోదరుల’ లాకర్లలో 4.50 కిలోల బంగారం సీజ్‌

19 Mar, 2023 01:32 IST|Sakshi

తిరువొత్తియూరు: తంజావూరుకు చెందిన హెలికాప్టర్‌ సోదరుల బ్యాంకు లాకర్ల నుంచి పోలీసులు 4.50 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. తంజావూరు జిల్లా కుంభకోణం శ్రీనగర్‌ కాలనీ దీక్షితర్‌ తోటమ్‌ వీధికి చెందిన ఎంఆర్‌ గణేషన్‌ (52), ఎంఆర్‌ స్వామినాథన్‌ (49) హెలికాప్టర్‌ సోదరులుగా గుర్తింపు పొందారు. వీరిద్దరూ ఫైనాన్స్‌ సంస్థ, పాల డిపో తదితర వృత్తులను చేస్తూ ఉన్నారు. కొన్నేళ్ల వీరిద్దరూ తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి రెట్టింపు నగదు ఇస్తామని చెప్పి ఓ ప్రకటన ఇచ్చారు. దీంతో వారి ఫైనాన్స్‌ సంస్థలో ప్రజలు రూ.600 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే డిపాజిట్‌ దారులకు తిరిగి చెల్లించకపోవడంతో వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవల వీరిద్దరూ బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో తంజావూరు వాణిజ్య క్రైమ్‌ విభాగం పోలీసులు విచారణలో హెలికాప్టర్‌ సోదరుల పేరుతో కుంభకోణంలోని ప్రైవేటు ఫైనాన్స్‌ బ్యాంకు లాకర్లలో నగలు ఉన్నట్లు తెలిసింది. దీంతో వాణిజ్య క్రైమ్‌ విభాగం డీఎస్పీ ముత్తు కుమారు నేతృత్వంలో పోలీసులు తనిఖీ చేయగా లాకర్లలో సుమారు 4.50 కిలోల బంగారం, 24.50 కిలోల వెండి వస్తువులు లభ్యమయ్యాయి. వాటిని పోలీ సులు కోర్టుకు అప్పగించారు. ఈ విషయంపై హెలికాప్టర్‌ సోదరులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు