సినిమాకు ముందు ఎన్నో కష్టాల్లో ఉన్నా: హీరో శింబు

20 Mar, 2023 01:56 IST|Sakshi

శింబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పత్తు తల. ఆ మధ్య వరుస ప్లాప్‌లతో సతమతమైన ఈయన మానాడు చిత్రం విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. కాగా జ్ఞానవేల్‌ రాజా స్టూడియో గ్రీన్‌ సంస్థ,పెన్‌ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన చిత్రం పత్తు తల. దీనికి చిల్లన్ను ఒరు కాదల్‌ చిత్రం ఫేమ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. నటుడు గౌతమ్‌ కార్తీక్‌, నటి ప్రియా భవానీ శంకర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పత్తు తల చిత్రం ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఇందులో పాల్గొన్న ఏఆర్‌ రెహమాన్‌ చిత్రంలోని రెండు పాటలు వేదికపై పాడడం విశేషం. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలోని అక్కరైయిల్‌ అనే పాటను శింబు పాడాల్సి ఉందని, అయితే ఆయన థాయిలాండ్‌ వెళ్లడంతో తానే ఆ పాటను పాడానని చెప్పారు. మొదట్లో ఇళయరాజా, ఎమ్మెస్‌ విశ్వనాథన్‌, కె.మహదేవన్‌ తదితరుల వద్ద పనిచేశానని, అయితే టి. రాజేందర్‌ వర్కు చూసి అప్పటి వరకు ఇన్ట్రోవర్ట్‌గా ఉన్న తాను ఎక్స్‌ట్రోవర్ట్‌గా మారానన్నారు. అందుకే ఆయన తనకు ఇన్‌స్పరేషన్‌ అని చెప్పారు.

నటుడు శింబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రారంభించే ముందు తాను చాలా కష్టాల్లో ఉన్నారన్నారు. అప్పుడు రాజా ఫోన్‌ చేసి ఈ చిత్రం గురించి చెప్పినప్పుడు తాను ఇంట్లోనే ఉంటున్నాను. బయటకు రాను అని చెప్పానన్నారు. అయితే పది రోజుల తర్వాత మళ్లీ ఆయనే ఫోన్‌ చేసి పత్తు తల చిత్రం చేద్దామని చెప్పారన్నారు. ఇది కన్నడ చిత్రం అన్నారు. ఈ చిత్రం తనకు సక్సెస్‌ ఇవ్వకపోయినా గౌతమ్‌ కార్తీక్‌కు విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానన్నారు.

తనకు ఏఆర్‌ రెహమాన్‌ గాడ్‌ ఫాదర్‌ లాంటివారని పేర్కొన్నారు. ఆయనకు తనపై ఉన్న ప్రేమాభిమానాలను కాపాడుకుంటానన్నారు. తన ఆధ్యాత్మిక చింతనకు ఆయనే గురువని పేర్కొన్నారు. కాగా తనకు ఈ చిత్రంలోనూ తోడు లేదు, లైఫ్‌ లోనూ తోడు లేదని అన్నారు. ఇప్పుడు తాను ఇంతకుముందులా కాదని వేరే లెవెల్‌లో వచ్చానని అన్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సినిమా లైట్‌మెస్‌ సహాయార్థం నిర్వహిస్తున్న సంగీత విభావరి యాప్‌ను శింబు చేతుల మీదుగా ఈ వేదికపై ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు