నిను వీడని నీడను నేను..

20 Mar, 2023 01:56 IST|Sakshi

అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం వ్యవహారం మళ్లీ సందిగ్ధంలో పడింది. ప్రధాన కార్యదర్శి ఎన్నికల ప్రక్రియకు కోర్టు అనుమతి ఇచ్చినా.. ఫలితాలను మాత్రం వెల్లడించ వద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు స్టే విధిస్తూ న్యాయమూర్తి కుమరేష్‌బాబు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. కాగా హైకోర్టు ఉత్తర్వులు తమ

వర్గానికంటే.. తమ వర్గానికి అనుకూలం

అని పళణి, పన్నీరు శిబిరాలు సంబరాలు

చేసుకోవడం గమనార్హం.

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే తాత్కాలికప్రధాన కార్యదర్శి పళణి స్వామి, సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం శిబిరాల మధ్య జరుగుతున్న సమ రం గురించి తెలిసిందే. పార్టీని కై వసం చేసుకునేందుకు పళణి స్వామి చేస్తున్న ప్రయత్నాలకు కోర్టుల ద్వారా మొకాలొడ్డేందుకు పన్నీరు సెల్వం తుది వరకు న్యాయ పోరాటం చేస్తున్నారు. కొన్ని పిటిషన్ల విచారణలలో కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడంతో.. ఇదే అదనుగా పార్టీప్రధాన కార్యదర్శి పగ్గాలను చేజిక్కించుకునేందుకు పళణి వ్యూహాలకు పదును పెట్టారు. అనుకున్నదే తడవుగా ప్రధాన కార్యదర్శి పదవి ఎన్నికలకు శుక్రవారం నగారా మోగించారు. శనివారం నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. ఈ పరిణామాలతో అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం ఖారారైనట్లుగా పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే, దీనిని అడ్డుకునే విధంగా పన్నీరు సెల్వం ఎత్తుకు పై ఎత్తు వేశారు.

సెలవు రోజు కూడా విచారణ..

ఇప్పటికే పళణి నేతృత్వంలో జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశ తీర్మానాలను వ్యతిరేకిస్తూ పన్నీరు శిబిరం దాఖలు చేసిన పిటిషన్‌ గత వారం విచారణకు వచ్చిన విషయం తెలిసిందే. తదుపరి విచారణ ఏప్రిల్‌ 11వ తేదీకి వాయిదా పడింది. ఈ సమయంలో ఆగమేఘాలపై ప్రధాన కార్యదర్శి ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువరించడం, నామినేషన్ల ప్రక్రియ చేపట్టడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, దీనికి అడ్డుకట్ట వేయాలని పన్నీరు శిబిరం తరపు నేతలు వైద్యలింగం, మనోజ్‌ పాండియన్‌, జేసీడీ ప్రభాకర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ అత్యవసర పిటిషన్‌గా సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి కుమరేష్‌బాబు ముందు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది.

వాడీవేడిగా వాదనలు..

ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. తొలుత పన్నీరు ప్రతినిధులు జేసీడీప్రభాకర్‌, వైద్యలింగం, మనోజ్‌ పాండియన్‌ తరపు న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. ప్రధాన కేసులు కోర్టులో విచారణలో ఉన్న సమయంలో ఆగమేఘాలపై ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికల నిర్వహణకు అవసరం ఎందుకు వచ్చిందో అని పళణి స్వామి శిబిరాన్ని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు వచ్చిన తీర్పునకు అనుగుణంగానే అన్ని వ్యవహారాలూ జరుగుతున్నట్లు కోర్టుకు ఆవర్గం న్యాయవాదులు వివరించారు. అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌ మగన్‌హుస్సేన్‌ తరపున సీనియర్‌ న్యాయవాది విజయనారాయణన్‌ వాదిస్తూ, త్వరలో లోక్‌ సభ ఎన్నికలు రానున్నాయని, ఈ సమయంలో పార్టీ అభ్యర్థుల బీ ఫామ్‌లలో సంతకాల విషయంగా స్పష్టమైన నిర్ణ యాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని, దీనిని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సైతం సమర్పించాల్సి ఉందని వివరించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలలో కోర్టు లు జోక్యం చేసుకోవద్దు అని కోరారు. పార్టీ నిబంధనలను పరిస్థితులకు అనుగుణంగా మా ర్చుకునే అవకాశం అన్నాడీఎంకేలో ఉందని వాదించారు.

ఎన్నికలకు ఓకే...ఫలితాలకు చెక్‌..

వాదనల అనంతరం న్యాయమూర్తి కుమరేష్‌ బాబు పలు ప్రశ్నలను సందించారు. అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశం తీర్మానాల వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ తదుపరి విచారణ ఏప్రిల్‌ 11వ తేదీకి వాయిదా పడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ సమయంలో ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. చివరకు ప్రధాన కార్యదర్శి ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు విధించడం లేదని, అయితే, ఫలితాల వెల్లడికి మాత్రమే స్టే విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అలాగే, ఏప్రిల్‌ 11వ తేదీకి వాయిదా వేసిన పిటిషన్‌ను ముందుగానే ఈనెల 22వ తేదీ విచారించనున్నట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణను పూర్తి చేసి ఈనెల 24న తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.

ఇది మా గెలుపే..

కోర్టు ఆదేశాల అనంతరం పన్నీరు సెల్వం ప్రతినిధి మనోజ్‌ పాండియన్‌ మీడియాతో మాట్లాడుతూ, కార్యదర్శి ఎన్నిక ఫలితాన్ని వెల్లడించ కూడదని కోర్టు ఆదేశించడం తమ న్యాయ పోరాటానికి లభించిన విజయమని ధీమా వ్యక్తం చేశారు. న్యాయం ధర్మం తమ వైపు ఉందని, కూవత్తూరు ముఠా ఆగడాలకు కల్లెం వేస్తామన్నారు. పార్టీ రక్షించుకుంటామన్నారు. 2026 వరకు అన్నాడీఎంకేలో సమన్వయ కమిటీ కొనసాగుతుందని, దీనిని అడ్డుకోలేరని పేర్కొన్నారు. పళణి స్వామికి ధైర్యంగా ఉంటే, పార్టీ పదవి కోసం ప్రత్యక్షంగా పన్నీరుతో పోటీకి సిద్ధం కావాలని, అప్పుడు పార్టీ కేడర్‌ మద్దతు ఎవరికో అన్నది స్పష్టం అవుతుందని సవాల్‌ చేశారు. ఈయన వ్యాఖ్యలపై పళని మద్దతు అన్నాడీఎంకే నేత జయకుమార్‌ స్పందిస్తూ, పన్నీరు సెల్వం నైరాశ్యంలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.

పళణి స్వామిని వెంటాడుతున్న పన్నీరు సెల్వం

మళ్లీ సందిగ్ధంలో ఏక నాయకత్వం

ప్రధాన కార్యదర్శి ఎన్నికలకు హైకోర్టు అనుమతి

ఫలితాల వెల్లడిపై మాత్రం స్టే

24న తుది తీర్పు ఇస్తామన్న జడ్జి

సంబరాల్లో ఇరు వర్గాలు..

కోర్టు ఆదేశాలతో పన్నీరు, పళణి శిబిరాలు సంబరాలు చేసుకోవడం సర్వత్రా విస్మయం కలిగించింది. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులను కోర్టువిధించని దృష్ట్యా, నామినేషన్ల పర్వం ముగియగానే తమ నేత ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవంగా ఎంపికై నట్లే అని పళణి స్వామి మద్దతు దారులు ఆనందం వ్యక్తం చేశారు. బాణ సంచాలు పేల్చుతూ, స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకోవడం గమనార్హం. అలాగే పన్నీరు శిబిరం కూడా వేడుకలు చేసుకుంది. పళణి స్వామి ప్రధాన కార్యదర్శి పదవికి చెక్‌ పెట్టే విధంగా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని ఆ వర్గం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన స్టేను ఎత్తి వేసేలా ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించేందుకు పళణిస్వామి సిద్ధమయ్యారు.

మరిన్ని వార్తలు