ఆలయానికి వెళ్తూ.. మృత్యు ఒడిలోకి.. !

20 Mar, 2023 01:56 IST|Sakshi
ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న పోలీసులు
●బస్సును అధిగమించే సమయంలో లారీని ఢీకొన్న వ్యాన్‌ ●ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు ●తిరుచ్చి సమీపంలో ఘోరం

సాక్షి, చైన్నె: పరిహార పూజల నిమిత్తం కులదైవం ఆలయానికి వెళ్తూ ఓ కుటుంబం ప్రమాదం బారిన పడింది. బస్సును అధిగమించే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో వ్యాన్‌లో ఉన్న వారిలో ఆరుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. ఆదివారం వేకువ జామున తిరుచ్చిసమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. నామక్కల్‌ జిల్లా తేత్తా పాళయంకు చెందిన ముత్తు స్వామి (58) కుమారుడు ధనపాల్‌(36) తన బంధువులు సేలం కోనార్‌ పట్టికి చెందిన పళణిస్వామి భార్య ఆనందాయి(57), ఆమె కుమారుడు తిరుమురుగన్‌(29), అదే ప్రాంతానికి చెందిన గోవిందన్‌ భార్య శకుంతల (28), ఆమె కుమార్తె దావని శ్రీ(9), నామక్కల్‌కు చెందిన తిరుమూర్తి (43), అదే ప్రాంతానికి చెందిన అప్పు అలియాస్‌ మురుగేషన్‌తో కలిసి పరిహార పూజల నిమిత్తం కులదైవం ఆలయానికి వెళ్లాలని నిర్ణయించారు. తంజావూరు జిల్లా తిరువిడై మరుదూర్‌లోని మహాలింగం స్వామి దర్శనానికి వెళ్లి అక్కడ పూజలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం శనివారం రాత్రి అద్దె ఆమ్నీ వ్యాన్‌లో బయలు దేరారు.

వ్యాన్‌ను సంతోష్‌కుమార్‌(31) నడిపాడు. కుంబకోణం వైపుగా వెళ్తున్న సమయంలో వీరి వ్యాన్‌ ప్రమాదానికి గురైంది.

అక్కడికక్కడే..

ఆదివారం ఉదయం మూడున్నర గంటల సమయంలో తిరుచ్చి – సేలం జాతీయ రహదారిలోని తిరువాసి పెట్రోల్‌ బంక్‌ వద్ద ముందుగా వెళ్తున్న ప్రభుత్వ బస్సును అధిగమించేందుకు వ్యాన్‌ డ్రైవర్‌ సంతోస్‌కుమార్‌ ప్రయత్నించాడు. అదే సమయంలో ఎదురుగా అరియలూరు జిల్లా జయం కొండాం నుంచికరూర్‌ వైపుగా వెళ్తున్న లారీ రావడంతో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. లారీ ముందు భాగం దెబ్బ తిన్నడమే కాకుండా టైర్లు ఊడి పోయాయి. ఈ ప్రమాదంలో లారీ నుంచి కిందకు దూకేసి డ్రైవర్‌సెంథిల్‌ కుమార్‌ పరారయ్యాడు. వ్యాన్‌ నుజ్జునుజ్జు అయ్యింది. వ్యాన్‌లో గాడ నిద్రలో ఉన్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. బస్సులోని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించి, సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో ముత్తుస్వామి, ఆనందాయి, ధావని శ్రీ, తిరుమూర్తి, మురుగేషన్‌, సంతోష్‌కుమార్‌ ఘటనా స్థలంలో మరణించారు. ధనపాల్‌, తిరుమురుగన్‌, శకుంతల తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం తిరు చ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యాన్‌ శిథిలాలలో చిక్కుకున్న మృత దేహాలను బయటకు తీయ డానికి మూడు గంటలు శ్రమించాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు