ఖద్దర్‌ వ్యాపారంలోకి కమల్‌

22 Mar, 2023 01:20 IST|Sakshi

నటుడు కమలహాసన్‌కి ఇప్పటికే సకల కళా వల్లభుడు అనే పేరు ఉంది. నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన కమలహాసన్‌ 2008లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మక్కల్‌ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీలు ప్రారంభించి గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన అభ్యర్థులు గెలవకపోయినా మంచి ఓట్ల శాతాన్ని రాబట్టుకున్నారు.

అదేవిధంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుపలికి తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా కమలహాసన్‌ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన ఎప్పటి నుంచో ఖద్దరు వస్త్రాలకు, చేనేత కార్మికుల మద్దతు తెలుపుతూ వస్తున్నారు. గత ఏడాది హౌస్‌ ఆఫ్‌ ఖద్దర్‌ అనే వ్యాపార సంస్థను కూడా ఏర్పాటు చేశారు. గాంధీజీ సిద్ధాంతాలను అవలంభించేలా ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు కమలహాసన్‌ పేర్కొన్నారు. కాగా ఈ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు ఖద్దర్‌ వస్త్రాల నిపుణులను తీసుకొని ఆయన ఇటలీకి వెళ్లినట్లు మంగళవారం ఆ పార్టీ నాయకుడు వెల్లడించారు.

మరిన్ని వార్తలు