కన్నీటి సంద్రమైన కురివిమలై

24 Mar, 2023 06:18 IST|Sakshi
మృతులు (ఫైల్‌)

కురివిమలై పరిసర గ్రామాలు గురువారం కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. ఏ కుటుంబంలో చూసినా బాణసంచా పేలుడు విషాదమే కనిపించింది. కూలి పనులకు వెళ్లిన తమ వాళ్లు గుర్తు పట్టలేనంతగా చిద్రమై మరణించడంతో బాధిత కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతులేకుండా పోయింది.

సాక్షి, చైన్నె: కాంచీపురం సమీపంలోని కురివి మలైలో బుధవారం ఓ బాణసంచా పరిశ్రమలో బుధవారం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఇందులో 9 మంది మరణించారు. వీరి వివరాలను పోలీసులు సేకరించారు. కొన్ని మృతదేహాలు గుర్తు పట్ట లేనంతగా ఉండడంతో అతి కష్టం మీద వారిని గుర్తించారు. వీరిలో వల్లతోట్టం ఈశ్వరన్‌ ఆలయం వీధికి చెందిన గంగాధరన్‌(55), విజయ(38) దంపతులున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో తొమ్మిది, ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ దంపతుల కుమార్తెలు అనాథలయ్యారు. ఆదుకునేందుకు బంధువులు కూడా లేకపోవడంతో ఆ బాలికల పరిస్థితి దయనీయంగా మారింది. తల్లిదండ్రుల సంపాదన మీద ఆధార పడ్డ ఈ పిల్లల ఆలనా పాలన ప్రభుత్వం చూసుకోవాలని వల్లతోట్టం వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఈ ఘటనలో తయారమ్మన్‌ కులంకు చెందిన భూపతి (53), చామంతి పురానికి చెందిన మురుగన్‌(50), కురివిమలైకు చెందిన దేవి(32), శశికళ(45), కోటీశ్వరి(48), కంచికి చెందిన సుదర్శన్‌(31), గౌతమ్‌(15) కూడా మరణించారు. ఇందులో కురివిమలైకు చెందిన వారు ముగ్గురు ఉండటంతో ఆ గ్రామమే విషాదంలో మునిగింది. అలాగే సుదర్శన్‌ ఈ పరిశ్రమ యజమాని నరేంద్రన్‌ మేనళ్లుడిగా గుర్తించారు. నిండు గర్భిణిగా ఉన్న సుదర్శన్‌ భార్యను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అలాగే, మరో మృతదేహం గుర్తు పట్టలేనంతగా చిద్రమై ఉండడం బట్టి చూస్తే, ప్రమాద తీవ్రత ఏమేరకు ఉందో స్పష్టం అవుతోంది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు గురువారం అప్పగించారు. దీంతో ఆయా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి. ఈ ప్రమాదంలో మరణించిన వారందరూ రోజు వారీ కూలీలు కావడంతో ఆ కుటుంబాలు కోలుకోవడం అత్యంత క్లిష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. గాయపడ్డ వారిలో ఉమా, సరిత, శారదలు పోలీసులకు వచ్చిన వాంగ్ములంలో అతి భారీ శబ్దంతో ఈపేలుడు జరిగిందని, రెప్పపాటులో తమను మంటలు చుట్టుముట్టాయని, ఇక, తమ పిల్లలకు దిక్కెవ్వరనిని కన్నీటి పర్యంతం కావడం కలిచివేసింది.

మూడు పరిశ్రమలకు తాళం..

కాంచీపురంలో మరో మూడు బాణసంచా పరిశ్రమలు ఉన్నాయి. ముసరవాక్కం, సురుటల్‌,మానా మదిలలో ఉన్న పరిశ్రమలు, గోడౌన్లపై అధికారులు దృష్టి పెట్టారు. కలెక్టర్‌ ఆర్తీ ఆదేశాలతో ఆ పరిశ్రమలను తాత్కాలికంగా మూసివేశారు. ఇక్కడున్న భద్రతా చర్యలను అధికారులు పరిశీలిస్తున్నారు.

బాణసంచా పేలుడు ఘటనలో 10కి చేరిన మృతుల సంఖ్య

మరో ఐదుగురి పరిస్థితి విషమం

మూడుచోట్ల టపాకాయల ఫ్యాక్టరీలు సీజ్‌

కంచి కలెక్టర్‌ ఆర్తీ ఆదేశాలు

మరిన్ని వార్తలు