కదంతొక్కిన కాంగ్రెస్‌ శ్రేణులు

24 Mar, 2023 06:18 IST|Sakshi
చైన్నెలో కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద..

సాక్షి, చైన్నె : కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రంలోని కాంగ్రెస్‌ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈమేరకు ఆపార్టీ కార్యకర్తలు, నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. వివరాలు.. మోదీ ఇంటిపేరుపై రాహుల్‌ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ సమాచారంతో రాష్ట్రంలోకి కాంగ్రెస్‌ వర్గాలు భగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రల్లో భాగమే ఈ తీర్పుక్ష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి.పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. మైలాడుతురై, తంజావూరు, మదురై, కన్యాకుమారి, తిరునల్వేలి, తిరుచ్చితో పాటు చైన్నెలో నిరసనలు హోరెత్తాయి. చైన్నెలో మాంబళం రైల్వే స్టేషన్‌లో రైల్‌రోకోకు కాంగ్రెస్‌ నాయకులు దిగారు. దీంతో ఎలక్ట్రిక్‌ రైళ్ల సేవలకు ఆటంకం నెలకొంది. కుడందైలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి నేతృత్వంలో రైల్‌ రోకో జరిగింది. ఇక సూరత్‌ కోర్టు తీర్పు అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారంతా సభ నుంచి హఠాత్తుగా బయటకు వచ్చేశారు. సచివాలయం ఎదురుగా ఉన్న మార్గంలో బైటాయించారు. పార్టీ శాసన సభా పక్ష నేత సెల్వ పెరుంతొగై, ఎమ్మెల్యేలు విజయ ధారణి, ప్రిన్స్‌, రూబి మనోహర్‌ తదితరులు ముఖానికి నల్ల గుడ్డలను కట్టుకుని నిరసన తెలియజేశారు. మరి కొందరు నల్ల రిబ్బన్లను ప్రదర్శించారు. ఈమార్గంలో ట్రాఫిక్‌ జాం ఏర్పడడంతో ఎమ్మెల్యేలను పోలీసులు బుజ్జగించి నిరసన విరమింపజేశారు.

పలు చోట్ల ధర్నాలు, రైల్‌రోకోలు

సచివాలయం మార్గంలో ఎమ్మెల్యేల బైటాయింపు

మరిన్ని వార్తలు