ఆన్‌లైన్‌ రమ్మీకి మరొకరు బలి

26 Mar, 2023 02:10 IST|Sakshi

సాక్షి, చైన్నె: ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసైన ఓ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ గేమింగ్‌కు బానిసై, చివరికి అప్పుల్లో కూరుకుని ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య 42కు చేరింది. వివరాలు.. తిరుచ్చిలోని తుపాకీ తయారీ పరిశ్రమకు అనుబంధంగా ఉన్న ఓ ఆసుపత్రిలో తూత్తుకుడికి చెందిన ఇసక్కి ముత్తుకుమారుడు రవిశంకర్‌(42) హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య రాజలక్ష్మి, కుమారుడు సంవర్థన్‌ ఉన్నారు. ఆ పరిశ్రమకు సంబంధించిన క్వార్టర్స్‌లోనే రవిశంకర్‌ కుటుంబం నివాసం ఉంటోంది.

ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసైన ఇతగాడు తోటి ఉద్యోగుల వద్ద, బయటి వ్యక్తులు వద్ద భారీగా అప్పులు తీసుకున్నాడు. బయటి వ్యక్తుల వద్ద రూ. 6 లక్షల వరకు రుణం తీసుకుని ఆన్‌లైన్‌ రమ్మీ ఆడాడు. దీంతో రుణదాతల నుంచి అప్పు చెల్లించాలనే ఒత్తిడి పెరిగింది. ఆందోళనలో పడ్డ రవిశంకర్‌ గత రెండు రోజులుగా బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యాడు. విధులకు సైతం సెలవు పెట్టేశాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన ఎంతకూ నిద్ర లేవక పోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో పరిశ్రమ ఆవరణలోని ఆసుపత్రికి రాజలక్ష్మి తీసుకెళ్లింది.

అప్పటికే రవిశంకర్‌ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి గదిలో పరిశీలించారు. బెడ్‌ మీద అధిక సంఖ్యలో నిద్ర మాత్రల కవర్లు ఉండడంతో వాటిని మింగి బలవన్మర ణానికి పాల్పడి ఉండవచ్చు అన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. ఆన్‌లైన్‌ రమ్మీ కారణంగా అప్పుల పాలై రవిశంకర్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రవి శంకర్‌ మరణంతో ఆన్‌లైన్‌ రమ్మీకి బలైన వారి సంఖ్య 42కు చేరింది.

చట్టంపై పరిశీలన..
ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధం బిల్లును అసెంబ్లీలో రెండు రోజుల క్రితం ప్రభుత్వం మరోసారి ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిని శుక్రవారం రాజ్‌ భవన్‌కు పంపించారు. ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో చర్చించినట్లు తెలిసింది. ఈ పరిస్థితులలో శనివారం ఈ చట్టం గురించి రాజ్‌ భవన్‌లో న్యాయనిపుణులతో గవర్నర్‌ సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. దీంతో ఇప్పటికై నా ఈ బిల్లును గవర్నర్‌ ఆమోదిస్తారా..? లేదా..? అనే చర్చ ప్రారంభమైంది.

మరిన్ని వార్తలు