భర్త హత్య కేసులో భార్య, ప్రియుడికి యావజ్జీవం

26 Mar, 2023 02:10 IST|Sakshi

తిరువొత్తియూరు: కళ్లకురుచ్చి జిల్లాలో మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వివరాలు.. త్యాగదుర్గం సమీపంలోని బి. పాలయం గ్రామానికి చెందిన సుబ్రమణియన్‌ (44) రోజువారీ కూలి. ఇతని భార్య సెల్వి (37). ఈమెకు అదే గ్రామానికి చెందిన జయమురగన్‌ (45)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలుసుకున్న సుబ్రమణి సెల్వి తీరును ఖండించాడు.

అయినా కానీ ఆమె తన ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో ఆగ్రహించిన సెల్వి ప్రియుడితో కలిసి తన భర్తను 2021 ఏప్రిల్‌ 15న మద్యంలో విషం కలిపి ఇచ్చింది. దాన్ని తాగిన సుబ్రమణియన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భర్త విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సెల్వి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తన అన్న మృతిపై సందేహం ఉందని సుబ్రమణియన్‌ చెల్లెలు ఇందిర (39) పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సెల్విని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.

ఆ సమయంలో తన ప్రియుడి సలహా మేరకు మద్యంలో విషం కలిపి భర్తను చంపేసినట్లు ఆమె ఒప్పుకుంది. దీంతో సెల్వి, జయమురుగన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ కళ్లకురిచ్చి మూడవ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో గత ఏడాదిన్నరగా సాగుతూ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం న్యాయమూర్తి గీతారాణి నిందితులిద్దరికీ యావజ్జీవ శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు జయ మురుగన్‌ను కడలూరు సెంట్రల్‌ జైలుకు, సెల్విని వేలూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు