-

జమిలీ ఎన్నికలు తథ్యం..

3 Apr, 2023 12:38 IST|Sakshi
పళణిస్వామికి ఆహ్వానం పలుకుతున్న నాయకులు, కార్యకర్తలు

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడికే పళణి స్వామి సేలం పర్యటన ఆదివారం రోడ్‌షోను తలపించింది. దారి పొడవునా ఆయనకు అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. కాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి సైతం ఎన్నికలు రాబోతున్నాయని, ప్రతి ఒక్కరూ దీనికి సిద్ధంగా ఉండాలని కేడర్‌కు ఈ సందర్భంగా పళణి స్వామి సూచించారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా మూడు రోజుల క్రితం ఎడపాడి కె. పళణిస్వామి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ హోదాలో ప్రపథమంగా ఆదివారం చైన్నె నుంచి సొంత జిల్లా సేలంకు ఆయన బయలుదేరారు.

మొదట గ్రీన్‌ వేస్‌ రోడ్డులోని ఆయన ఇంటి వద్ద నుంచే అన్నాడీఎంకే వర్గాల హడావుడి మొదలైంది. వేద పండితుల పూర్ణ కుంభ స్వాగతం పలికారు. తర్వాత సేలానికి పళణిస్వామి రోడ్డు మార్గంలో బయలు దేరారు. ఆలందూరులోని ఎంజీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన పర్యటన రోడ్‌ షోను తలపించే విధంగా జరిగింది. మార్గం మధ్యలో తాంబరం, చెంగల్పట్టు, మదురాంతకం, దిండివనం, విల్లుపురం, అంటూ ప్రతి చోటా ఆయన కాన్వాయ్‌ ఆగింది. పార్టీ కేడర్‌ ఈ మేరకు పళణిస్వామికి బ్రహ్మరథం పట్టేవిధంగా ఆహ్వానం పలికారు. దారి పొడవున కేడర్‌ను పలకరిస్తూ వెళ్లడంతో సేలం చేరేలోపు రాత్రి ఏడు దాటింది. సేలంలోనూ ఆయనకు ఘన స్వాగతం లభించింది.

జమిలీ ఎన్నికలు తథ్యం..
దారి పొడవున తనకు బహ్మ్రరథం పట్టిన కార్యకర్తలను ఉద్దేశిస్తూ పళణి స్వామి ప్రసంగాలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో ఈసారి 40 స్థానాలు అన్నాడీఎంకే కూటమి చేజిక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీకి ఎన్నికలు వస్తే అధికార పగ్గాలు చేపట్టడం తథ్యమని, ఇందులో మరో ఆలోచన లేదని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం తనకు శుభాకాంక్షలు, ఆహ్వానం తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ పళణి స్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్‌, అమ్మజయలిత మార్గంలోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, ఈనెల 7వ తేదీన అన్నాడీఎంకే కార్యదర్శులు, జిల్లాల కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పళణి స్వామి తెలిపారు. అలాగే, సోమవారం మదురైలో పర్యటించాలని నిర్ణయించారు. దేవర్‌ సామాజిక వర్గాన్ని ఆకర్షించే విధంగా ఈ పర్యటన ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు