కళాక్షేత్ర ఆరోపణల వెనుక అదృశ్య శక్తులు

7 Apr, 2023 01:26 IST|Sakshi

సాక్షి, చైన్నె : కళాక్షేత్రలో లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని, ఈ వ్యవహారంపై పెద్ద డ్రామా జరుగుతోందని పూర్వ విద్యార్థి, సినీ నటి అభిరామి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, వాస్తవాలను వెలుగులోకి తీసుకు రావాలని కోరుతూ చైన్నె పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివ్వాల్‌ కార్యాలయంలో ఆమె గురువారం వినతి పత్రం సమర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థులను రెచ్చగొట్టి తెర వెనుక నుంచి ఎవరో రాజకీయం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కళాక్షేత్ర వ్యవహారంలో జరుగుతున్నది ఇదేనని ఆరోపించారు. ఇక, ఈ కేసులో అరెస్టయిన హరిపద్మన్‌ సతీమణి మీడియాతో మాట్లాడుతూ, తన భర్త ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఆయన ప్రత్యేకంగా క్లాస్‌ కూడా తీసుకోరని, ఆయన పని ముగియగానే కళాక్షేత్ర ఆవరణలో క్వార్టర్స్‌ ఇంటికి వచ్చేస్తారని వివరించారు. ఈ కేసులో ఆయన్ని బలి పశువు చేశారని, తన పిల్లల జీవితాలను సర్వనాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిర్యాదు చేసినట్టుగా పేర్కొంటున్న పూర్వ విద్యార్థినిని గతంలో తన భర్త ఓ విషయంగా మందలించారని, ఆ తర్వాత ఆ విద్యార్థిని అందరితో కలిసి ఆనందగానే ఉంటోందని, ప్రస్తుతం ఎందుకు ఇలా చేసిందో ఆమె విజ్ఞతకే వదిలి పెడుతున్నామని అన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని, తనకు న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు