పది నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు

15 Apr, 2023 02:24 IST|Sakshi

సాక్షి, చైన్నె : రాష్ట్రంలో మినీ క్రీడాస్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పది అసెంబ్లీ నియోజకవర్గాలలో తొలి విడతగా అన్ని హంగులతో క్రీడామైదానాలను తీర్చిదిద్దనున్నారు. ఒక్కో మైదానం పనులకు రూ. 3 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, క్రీడాకారులకు ప్రోత్సాహం, అంతర్జాతీయస్థాయి క్రీడా పోటీలకు చైన్నెను వేదికగా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వేదికగా క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ క్రీడా ప్రగతి గురించి ప్రత్యేక విజన్‌ను రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇందులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయనున్నామని, ఇది మినీస్టేడియం తరహాలో ఉంటాయని ప్రకటించారు. దీనిని కార్యరూపంలోకి తెస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు.

పది నియోజకవర్గాలలో..
తొలి విడతగా పది అసెంబ్లీ నియోజకవర్గాలలో మినీ స్టేడియంల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సీఎం స్టాలిన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న కొళత్తూరు, మంత్రి ఉదయనిధి ప్రాతినిథ్యం వహిస్తున్న చే పాక్కం– ట్రిప్లికేన్‌ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అలాగే వాణియంబాడి, కాంగేయం, చోళవందాన్‌, తిరువెరంబూరు, శ్రీ వైకుంఠం, పద్మనాభపురం, ఆలంకుడి, కారైక్కుడి అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గంలో రూ.3 కోట్లతో ఈ మైదానాలు ఏర్పాటు కానున్నాయి. మినీ స్టేడియంను తలపించే విధంగా ప్రేక్షకుల గ్యాలరీ, పరుగు పందెం ట్రాక్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, కబడ్డీ, ఆటల కోసం ప్రత్యేక ఏర్పాటు, క్రీడాకారులకు వసతి, ఇతర సౌకర్యాలతో ప్రత్యేక నిర్మాణాలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాలలో మినీస్టేడియంల నిర్మాణానికి అవసరమైన స్థల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. ఇక్కడ త్వరితగతిన పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలపై దృష్టిపెట్టారు.

మరిన్ని వార్తలు