తుపాకీతో కాల్చుకుని జవాను బలవన్మరణం

1 May, 2023 10:00 IST|Sakshi

సాక్షి, చైన్నె: నాగపట్నం నావికాదళం కార్యాలయంలో భద్రతా విధుల్లో ఉన్న జవాను రాజేష్‌(28) తన తుపాకీతో కాల్చుకుని ఆదివారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై నావికాదళం అధికారులు విచారణకు ఆదేశించారు. వివరాలు.. నాగపట్నం జిల్లా కేవి కుప్పానికి చెందిన రాజేష్‌(28) భారత నావికాదళంలో 2015 నుంచి జవానుగా పనిచేస్తున్నారు.

అధికారులతో కలిసి సముద్రంలో గస్తీకి వెళ్లడం లేదా కార్యాలయంలో షిప్ట్‌ల వారీగా భద్రతా విధుల్లో ఉండడం ఇతడి విధులు. శనివారం రాత్రి 12 గంటలకు రాజేష్‌ డ్యూటీకి వచ్చాడు. ఆదివారం వేకువ జామున మూడు గంటల సమయంలో తుపాకీ పేలిన శబ్దంతో అక్కడున్న అధికారులు, ఇతర సిబ్బంది ఆందోళనతో పరుగులు తీశారు. భద్రతా విధుల్లో ఉన్న రాజేష్‌రక్తపు మడుగులో పడి ఉండటంతో చైన్నెలోని ఉన్నతాధికారులకు తెలియజేశారు. నాగపట్నం టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

అతడు తన తుపాకీతో గొంతు భాగంలో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్తం నిమిత్తం నాగపట్నం ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఓ కుమారుడు ఉన్నారు. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా కుటుంబం తగాదాలు, ఏదేని మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉన్నాయా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు