బీజేపీలోకి పన్నీరు సెల్వం తనయుడు?

9 May, 2023 09:14 IST|Sakshi

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం తనయుడు, ఎంపీ రవీంద్రనాథ్‌ కొత్తవ్యూహాలకు పదును పెట్టారు. సొంత నియోజకవర్గం నుంచి ఈసారి ఆయన కమలం (తామర) చిహ్నంతో పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వివరాలు.. అన్నాడీఎంకేను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పళణి స్వామి పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఎలాగైనా న్యాయ పోరాటం ద్వారా ఆ పార్టీని తన వశం చేసుకునే వ్యూహాలకు సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం యత్నిస్తున్నారు. అయితే అన్నాడీఎంకే తన గుప్పెట్లోకి చేరేనా అన్న కలవరంలో పన్నీరు సెల్వం ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో ఆయన వారసుడు, ఎంపీ పి. రవీంద్రనాథ్‌ కొత్త వ్యూహాలకు పదును పెట్టారు.

అన్నాడీఎంకే నుంచి తనకు అవకాశం దక్కేది అనుమానం కావడంతో ఈసారి కాషాయం కండువాతో కాకుండా, కమలం చిహ్నంతో ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో డీఎంకే కూటమి రాష్ట్రంలో 38 స్థానాలు కై వసం చేసుకోగా, వ్యక్తిగత చరిష్మా, పార్టీ బలంతో అన్నాడీఎంకే తరపున రవీంద్రనాథ్‌ మాత్రమే పార్లమెంట్‌ మెట్లు ఎక్కారు. తాజాగా తన కుటుంబ వ్యక్తిగత చరిష్మతో మళ్లీ గెలవవచ్చు అనే ఽధీమాతో ఆయన ఉన్నా, చిహ్నం ఎక్కడ ఇరకాటంలో పెడుతుందో అనే బెంగ తప్పడం లేదటా...! అందుకే ఈ సారి ఆయన కమలం చిహ్నంతో పోటీ చేసి తేని లోక్‌సభ నియోజకవర్గంలో తమ బలాన్ని చాటే ప్రయత్నంలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.

అదే సమయంలో తనకు తామర చిహ్నంలో పోటీ చేసే అవకాశం కల్పించిన పక్షంలో దక్షిణ తమిళనాడులోని తన సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా మారుస్తామనే విషయాన్ని ఢిల్లీలో తను సన్నిహితంగా ఉన్న కేంద్రం పెద్దల దృష్టికి రవీంద్రనాథ్‌ తీసుకెళ్లినట్టు సమాచారం. అందుకే ప్రస్తుతం బీజేపీ తన సీట్ల సంఖ్యను 13కు పెంచినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాలపై గురి పెట్టి బీజేపీ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా రవీంద్రనాథ్‌ కోసం తేని సీటు, పుదయ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం కోసం వేలూరు సీటును ప్రస్తుతం బీజేపీ తెర మీదకు తెచ్చినట్లు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకే నుంచి ఈ 13 సీట్లను రాబట్టుకునే వ్యూహాలకు పదును పెట్టే విధంగా బీజేపీ ఢిల్లీ నేతలు ముందుకెళ్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు